calender_icon.png 23 September, 2024 | 6:58 AM

శ్రీలంక అధిపతిగా దిసనాయకే

23-09-2024 02:25:27 AM

రెండో రౌండ్‌తో కలిపి 42 శాతం ఓట్లతో గెలుపు

మార్క్సిస్టు నేతకు పట్టం కట్టిన లంకేయులు

రాజపక్స, విక్రమసింఘేల పరాభవం

విద్యార్థి నేత నుంచి దేశాధ్యక్షునిగా ఎదిగిన అనుర కుమార

కొలంబో, సెప్టెంబర్ 22: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టు నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు. శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలకు శనివారం పోలింగ్ జరగగా ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. . మొత్తం పోలైన ఓట్లలో 42.31 శాతం ఓట్లు అనుర సాధించినట్లు శ్రీలంక ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండోస్థానంలో నిలిచిన విపక్షనేత సాజిత్ ప్రేమదాసకు 32 శాతం ఓట్లు లభించాయి. కాగా, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తొలి రౌండ్‌లోనే పోటీ నుంచి వైదొలిగారు.

ఫలితాల నేపథ్యంలో శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే ప్రమాణస్వీకారం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ ప్రకటన చేసింది. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రాధాన్యత ఓట్ల పద్ధతిని పాటిస్తారు. ప్రెసిడెంట్ ఎన్నికలకు శనివారం పోలింగ్ జరగగా ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదట తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. దీంతో విజయానికి అవసరమైన 50 శాతానికి పైగా ఓట్ల కోసం రెండో రౌండ్ కౌంటింగ్‌ను చేపట్టారు. ఇందులో కమ్యూనిస్టు నేత దిసనాయకేకు ఆధిక్యం లభించడంతో ఆయన విజయం సాధించారు. 

ప్రజల మెప్పు పొంది

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దివాళా అంచున ఉన్న శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠగా సాగాయి. మాజీ అధ్యక్షుడు రాజపక్స, ప్రస్తుత అధ్యక్షుడు విక్రమసింఘే, కమ్యూనిస్టు నేత దిసనాయకే మధ్య త్రిముఖ పోరు నడిచింది. చివరకు మార్కిస్టు నేత దిసనాయకే పైచేయి సాధించారు. గత ఎన్నికల్లో 3 శాతం మాత్రమే ఓట్లు సాధించిన దిసనాయకే.. దేశంలో అవినీతిపై పోరాటమే అస్త్రంగా చేసుకుని సంచలన విజయం సాధించారు. 

సిద్ధాంతాలకు ఒదిగి..

విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి దిసనాయకే ప్రవేశించి ప్రస్తుతం దేశాధ్యక్షుడిగా ఎన్నికై సంచలనం సృష్టించారు. 1968 నవంబర్ 24న రాజధాని కొలంబో నగరానికి సమీపంలోని తంబుట్టెగామలోని ఓ కార్మిక కుటుంబంలో అనుర జన్మించారు. అక్కడే పాఠశాల విద్యనభ్యసించిన ఆయన.. ఆ గ్రామం నుంచి యూనివర్సిటీలో ప్రవేశం పొందిన తొలి విద్యార్థిగా ఘనత సాధించారు. బీఎస్సీలో డిగ్రీ చేసిన దిసనాయకే తర్వాత సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్‌లో చేరి కీలక పాత్ర పోషించారు. 1987లో జనతా విముక్తి పెరమునా (జేవీపీ)లో చేరి తన రాజకీయ పునాది నిర్మించుకున్నారు. 2000లో ఎంపీగా గెలిచిన ఆయన 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్‌పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. చంద్రికా కుమారతుంగా ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు.