తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేడి అప్పుడే తారస్థాయికి చేరుకుంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమై రెండు రోజులే అయి నప్పటికీ వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచే మొదలైంది. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీ అనూహ్యంగా ఓటమి పాలై, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి గద్దెనెక్కడంతోనే ఈ రెండు పార్టీల నేతలమధ్య మాటల యుద్ధం మొదలైంది. ఓటమిని జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్, దాని అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు మొదలుకొని మాజీ మంత్రులదాకా అందరు కూడా రేవంత్ రెడ్డి సర్కార్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.
ఈ క్రమంలో విమర్శలు శ్రుతిమించి వ్యక్తిగత దూషణల స్థాయికి చేరడం, కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగడంతో ప్రతిరోజూ తిట్ల పురాణం కొనసాగుతోంది. దీనికి తోడు రోజుకో నేత పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీ కండువా కప్పుకొంటూ ఉండడం కూడా బీఆర్‌ఎస్‌కు పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. విచిత్రమేమిటంటే బీఆర్‌ఎస్‌ను వీడి అటు కాంగ్రెస్‌లోనో, ఇటు బీజేపీలోనో చేరిన కొద్దిరోజులకే కొందరు నేతలు తమకో, తమ వారసులకో ఎంపీ టికెట్ సంపాదించడం ఆ పార్టీని మరింతగా కుదిపేసింది. పార్టీలో కీలక నేతలుగా చెలామణి అవుతూ వచ్చిన కేశవరావు, కడియం శ్రీహరి లాంటి వాళ్లుకూడా పార్టీని వీడడం కేసీఆర్ ఎదురుదాడికి దిగేలా చేసింది.
ప్రమాదం కారణంగా నాలుగు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆయన పూర్తిగా కోలుకోక ముందే కార్యక్షేత్రంలోకి దిగాల్సి వచ్చింది. ముఖ్యంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ గత కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూ ఉండడంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈలోగా లోక్‌సభ ఎన్నికలు వచ్చి పడడంతో అప్పుడు మొదలైన విమర్శలు మరింత పదునెక్కి వ్యక్తిగత విమర్శలకు దారి తీస్తున్నాయి. ఈ దాడి, ఎదురుదాడుల పర్వంలో బీజేపీ నేతలే కాస్త సంయమనం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకరిద్దరు నేతలు మినహా మిగతా వారు వ్యక్తిగత విమర్శల జోలికి పెద్దగా వెళ్లడం లేదు.
వర్షాభావం కారణంగా తలెత్తిన కరవు పరిస్థితులు, తాగు, సాగు నీటి సమస్యలు, అకాల వర్షాలు, ధాన్యం కొనుగోలుతోపాటుగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు లాంటి వాటిపైనే ప్రధానంగా బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు రేవంత్ సర్కార్‌ను నిలదీస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయని ప్రభుత్వాన్ని నిలదీసి తీరుతామని, ఈ ప్రభుత్వానికి ఇతర పార్టీలనుంచి చేరికలపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలను తీర్చడంపై లేదని, వారికి పరిపాలన చేత కాదంటూ ఇటీవల మహబూబ్‌నగర్, కరీంనగర్‌లలో జరిగిన సభల్లో కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌పైన వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటుగా పలువురు మంత్రులు కూడా కేసీఆర్‌పైన, ఆయన పదేళ్ల పాలన పైనా ఎదురుదాడికి దిగారు.
తాను హైటెన్షన్ వైర్ లాంటివాడినని, ముట్టుకుంటే మసయిపోతారని మహబూబాబాద్, మెదక్ సభల్లో రేవం త్ చేసిన ప్రసంగాలు ఎన్నికల హీట్‌ను మరింతగా పెంచే అవకాశం ఉంది. అయితే ఈ దూషణల పర్వం కారణంగా ప్రజా సమస్యలు మరుగున పడే ప్రమాదం ఉంది. సగటు ఓటరు కూడా పార్టీలు పరస్పరం చేసుకునే విమర్శలను తాత్కాలికంగా ఎంజాయ్ చేయవచ్చునేమో కానీ, వాటి గురించి ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు అసహ్యించుకునే ప్ర మాదం లేకపోలేదు. గతంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ప్ర చారాలు ఎంతో హుందాగా స్థానిక సమస్యలు, రాజకీయ సిద్ధాంతాల ఆ ధారంగా సాగేవి. రానురాను ఆ ధోరణి మారిపోయి ప్రత్యర్థులను శత్రువుల్లాగా చూసే స్థితి వచ్చింది. ఇది సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదు.