రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వైఎస్‌ఆర్ వారసులు వైఎస్ జగన్, షర్మిల మధ్య కొంత కాలంగా సాగుతున్న ఆస్తుల వివా దం ఇప్పుడు రచ్చకెక్కింది. ఈ వివాదంలో తల్లి విజయమ్మ కూడా ప్రవేశించడంతో ప్రస్తుతం ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఏపీ మాజీ మఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా ఎంత బలమైన నాయకుడో అందరికీ తెలుసు.
బతికున్నంత కాలం రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఆయన మరణాంతరం కూడా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రభావం చూపించారు. అయితే రచ్చ గెలిచిన వైఎస్‌ఆర్ ఇంటమాత్రం గెలవలేకపోయారని తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. వైఎస్ మరణాంతరం ఆయన కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి.
ఆయన కన్నబిడ్డలయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలలు అన్నాచెల్లెళ బంధాన్ని మరిచి ఆస్తులు, రాజకీయ వారసత్వం కోసం ఇప్పుడు గొడవపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలే రాజకీయ వైరానికి దారితీశాయి. ఇది ఒకరి రాజకీయ జీవితాన్ని మరొకరు నాశనం చేసుకునే స్థాయికి చేరుకుంది.
అయితే ఇటీవల వీరిద్దరి మధ్య ఆస్తులకు సంబంధించి రాజీ కుదిరిందనే వార్తలు వచ్చాయి.దీంతో వైఎస్‌ఆర్ వారసుల వ్యక్తిగత, రాజకీయ వైరానికి ‘శుభం కార్డు’ పడినట్లేనని భావించారు. అయితే ఊహించని విధంగా సోదరి షర్మిలకు ఆస్తి పంచివ్వడం కాదుకదా, తన చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మలకు గతంలో తమ కంపెనీలో ఇవ్వాలనుకున్న ఆస్తుల విషయంలోనూ ఆయన మనసు మార్చుకున్నారు.
సరస్వతి పవర్ కంపెనీలో ఈ ఇద్దరికి వాటా ఇవ్వడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని జగన్ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు న్యాయపోరాటానికి కూడా సిద్ధమయ్యారు. అంతేకాదు, ప్రేమ, ఆప్యాయతతో గతంలో కొన్ని ఆస్తులు ఇచ్చానని, అయితే తనను రాజకీయంగా వ్యతిరేకించడంతో పాటు వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యవహరించావంటూ సోదరి షర్మిలకు ఓ లేఖ కూడా రాశారు.
ఈ కారణంగానే సరస్వతి పవర్‌లో ‘గిఫ్ట్‌డీడ్’ కింద రాసిచ్చిన వాటాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తన లేఖలో స్పష్టం చేశారు. జగన్ లేఖకు అంతే ఘాటుగా షర్మిల సమాధానం ఇచ్చారు. దీంతో అన్నాచెల్లి మధ్య వైరం మరింత ముదిరింది.
నిజానికి వైఎస్ షర్మిల తన అన్న జగన్ సీఎం కావడానికి ఎంతగానో శ్రమించారు. 2012లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఫలితంగా ఎన్నికలు జరిగిన 18 స్థానాల్లో 15 సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. 2019లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘జగన్ వదిలిన బాణాన్ని నేను’ అని చెప్తూ రాష్ట్రమంతా విస్తృతంగా ప్రచారం చేశారు.
ఫలితంగా జగన్ 175 స్థానాలున్న అసెంబ్లీలో 151 సీట్లు దక్కించుకుని తిరుగులేని మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. అన్న గెలుపు కోసం ఇంతగా కష్టపడిన తనకు జగన్ ప్రభుత్వంలో లేదా పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని షర్మిల ఆశించారు. అయితే అదేమీ జరగలేదు. అప్పటినుంచీ వీరిద్దరి మధ్య వైరం మొదలైంది. 2021లో షర్మిల వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరిట సొంత పార్టీని ప్రారంభించారు.
కొద్ది కాలానికే వచ్చిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఆ తర్వాత అనూహ్యంగా షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. అప్పటినుంచి అన్నాచెల్లెళ్ల మధ్య ప్రత్యక్ష పోరు మొదలైంది. ఇది చివరికి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఘోరపరాజయానికి కారణమయింది. దీంతో వీరిద్దరి మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరానికి ఇప్పుడు ఆస్తుల వివాదం తోడయింది.
తన తండ్రి వారసత్వంగా లభించిన వందల కోట్ల రూపాయల ఆస్తులతో పాటుగా బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో తనకు దక్కాల్సిన ‘న్యాయమైన’ వాటా కోసం షర్మిల ఇప్పుడు న్యాయపోరాటానికి కూడా సిద్ధమయ్యారు. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.