calender_icon.png 16 January, 2025 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాల సమావేశాలు

21-12-2024 12:00:00 AM

ఈ ఏడాది చిట్టచివరి సమావేశాలైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఆద్యంతం గొడవలు, వాయిదాలపర్వంగా సాగిందనే చెప్పాలి. గత నెల 25న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు పేరుకు 26 రోజుల పాటు కొనసాగినా, ఒక్కరోజు కూడా సజావుగా సాగిన పాపా న పోలేదు. చివరి రోజుసైతం అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష కూటమి ఎంపీల పోటాపోటీ నిరసనల మధ్య నిరవధికంగా వాయిదా పడ్డాయి.

గురువారం పార్లమెంటు ఆవరణలో ఇరుపక్షాల సభ్యుల మధ్య బలప్రదర్శనగా మారిన తోపులాట ఘటనకు కొనసాగింపుగా ఈ ప్రదర్శనలు కొనసాగాయి. జమిలి ఎన్నికల బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపే  తీర్మానాన్నిగొడవ మధ్యనే ఉభయ సభలు ఆమోదించాయి. నిజానికి పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాయిదాలతో మొదలయ్యాయి.  వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు, మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ విపక్షాలు చేసినఆందోళనలతో ఉభయ సభల్లో తొలివారమంతా వాయిదాల పర్వం కొనసాగింది.

ఏ రోజు కూడా ఉభయ సభలు ఒక్క గంట కూడా సజావుగా సాగలేదు. సభలోపలే కాకుండా బయటకూడా ప్రతిపక్షాలు నిత్యం నిరసనలు కొనసాగించాయి. ఈ నెల 13నుంచి రాజ్యాంగంపై ఉభయ సభల్లో చెరి రెండు రోజుల పాటు వాడీ వేడిగా చర్చ జరిగింది. రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్‌షా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి కారణమయ్యాయి.

రాజ్యాగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించిన అమిత్‌షా రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో మొదలైన గొడవ చివరి రోజు దాకా కొనసాగడం గమనార్హం. తాను చేసిన వ్యాఖ్యలను అమిత్ షా సమర్థించుకోగా, ప్రధాని మోదీ సైతం హోంమంత్రికి మద్దతుగా నిలవడంతో వివాదం మరింత ముదిరింది. అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు రోజుకో రకంగా ఆందోళనలు చేయడం మొదలుపెట్టాయి.

దీనికి ప్రతిగా బీజేపీ ఎంపీలు కూడా ఆందోళనలు చేపట్టడం ఇరుపక్షాల మధ్య తోపులాటకు, ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ డానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇరుపక్షాలు పరస్ప రం ఆరోపణలు చేసుకుంటూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి కూడా. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై ప్రతిపక్షాల అవిశ్వాసతీర్మానం, ప్రియాంక గాంధీ లోక్‌సభ అరంగేంట్రం వంటి ఘటనలుకూడా ఈ సమావేశాల్లోనే  చోటుచేసుకున్నాయి. ఏడాది మొత్తంలో తక్కువ ఉత్పాదకత ఈ సమావేశాల్లోనే ఉందని ప్రభు త్వం సైతం చెప్తూ ఉంది. లోక్‌సభలో నాలుగు, రాజ్యసభలో మూడు బిల్లులకు మాత్రమే ఆమోదం లభించింది.

మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ వచ్చిన జమిలి ఎన్నికల బిల్లును ఈ సమావేశాల్లోనే  ప్రవేశ పెట్టడం జరిగింది. లోక్‌సభతో పాటుగా రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరపడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాజ్యాంగ మూలస్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున దీన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది.

దీంతో జమిలి ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసినట్లయింది. ఇదొక్కటి మినహాయిస్తే ఈ సమావేశంలో అధికార పక్షం సాధించింది ఏమీ లేదు. వాస్తవానికి ప్రస్తుతం జేపీసీ పరిశీలనలో ఉన్న వక్ఫ్ బోర్డుల సవరణ బిల్లుకు సైతం ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందాలని ప్రభుత్వం భావించింది. అయితే వరస గొడవల నేపథ్యంలో అది వీలు పడలేదు. మొత్తం మీద పార్లమెంటు శీతాకాల సమావేశాలు దిగజారుతున్న ‘ప్రజాస్వామ్య దేవాలయం’ ప్రతిష్ఠను మరింత మసకబారేలా చేశాయనే చెప్పాలి.