calender_icon.png 13 October, 2024 | 1:51 PM

ధాన్యం రవాణా టెండర్ కోసం కలెక్టరేట్‌లో కుమ్ములాట..!

11-09-2024 02:13:50 PM

ఆన్లైన్ టెండర్లు వేసినా ఆఫ్ లైన్ టెండర్లలో పొలి"ట్రిక్స్"

తమ వర్గానికి మాత్రమే టెండర్ దక్కేలా తెర వెనక రాజకీయం

రాయలసీమ ఫ్యాక్షన్ తరహాలో పోలీసుల ముందే రౌడీయిజం

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ధాన్యం రవాణా కోసం సివిల్ సప్లై మేనేజర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన టెండర్ ప్రక్రియలో కేవలం ఒక వర్గం మాత్రమే టెండర్ దక్కించుకునేలా ఇతరులను టెండర్లు వేయకుండా అడ్డుకుంటూ ఒకరినొకరు తోసుకున్నారు. కొంతమంది టెండర్లు వేయడానికి వచ్చిన టెండర్ దారుల నుండి పత్రాలను దొంగిలించి మరికొన్ని పత్రాలను చించేశారు.

టెండర్ వేసేందుకు వచ్చే మరో వ్యక్తిని కారులోనే బంధించి టెండర్ ప్రక్రియ ముగిశాక వదిలేశారు. మరో మహిళ టెండర్ దారు నుంచి పత్రాలను దొంగిలించారు. ఇవన్నీ పోలీసుల కళ్ళముందే జరిగిపోవడంతో అసలేం జరుగుతుందా అన్న అయోమయం నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంతాల్లోని రైతులు పండించే ఖరీఫ్ సీజన్ ధాన్యాన్ని ఆయా మిల్లులకు తరలించే వాహనాలు టెండర్ ద్వారా కాంట్రాక్టు దక్కించుకోవలసి ఉంది. ఇందుకోసం జిల్లా సివిల్ సప్లై మేనేజర్ నుండి గత నెల ఆన్లైన్ టెండర్ ద్వారా దరఖాస్తులను కోరింది.

కాగా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరూ బుధవారం జిల్లా సివిల్ సప్లై మేనేజర్ కార్యాలయంలోని టెండర్ బాక్స్ లో పొందుపరచాల్సి ఉంటుంది. కాగా కొల్లాపూర్, నాగర్ కర్నూల్ ప్రాంతాలకు కేవలం ఒక్కొక్క టెండర్ మాత్రమే నమోదు కావడం విశేషం. అచ్చంపేటకు రెండు టెండర్లు కల్వకుర్తికి నాలుగు చొప్పున టెండర్లు దాఖలయ్యాయి. మరి కొంతమంది టెండర్ దారులను కలెక్టరేట్ ప్రాంగణంలోనే గ్రౌండ్ ఫ్లోర్ వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది లీడర్లు వారిని అడ్డుకోవడంతో పాటు వారి టెండర్ ఫారాలను లాక్కున్నారు. మరో వ్యక్తిని కారులోనే బంధించినట్లు ఆరోపించారు.

టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నంతసేపు నాగర్కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాసులు, సిఐ కనకయ్య, నాలుగు నియోజకవర్గాల ఎస్ఐలు ఇతర పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అయినప్పటికీ వారి కళ్ళముందే ఈ వ్యవహారం అంతా జరగడం పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత బిఆర్ఎస్ పాలనలో ఇంతటి అరాచకం ఎన్నడూ చూడలేదని రాయలసీమ ఫ్యాక్షన్ తరహాలో బెదిరింపులు, రౌడీయిజం పోలీసుల ముందే ప్రదర్శించినట్లు బాధితులు ఆరోపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్లు టెండర్ దారులు పేర్కొన్నారు.