18-03-2025 01:01:37 AM
ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్
భద్రాచలం మార్చి 17 (విజయ క్రాంతి) గిరిజన దర్బార్ లో అర్జీలు పెట్టుకునే ప్రతి దరఖాస్తుదారునికి ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా సంబంధిత యూనిట్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు.
సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన గిరిజన దర్బార్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అధికారిక పనులపై వెళ్లినందున, వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందే విధంగా సంబంధిత యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఎక్కువ శాతం దరఖాస్తులు పోడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ట్రైకార్ ద్వారా అందించే సబ్సిడీ రుణాల కొరకు, కొత్తగా ఏర్పాటు చేసే మత్స్యకార సొసైటీల అనుమతి కొరకు, వ్యవసాయానికి సంబంధించి కరెంటు, బోరు, మోటారు కొరకు, గిరిజన గ్రామాలలో విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, మరియు జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత రుణాలు ఇప్పించుట కొరకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉపాధి పొందుటకు శిక్షణలు ఇప్పించుట కొరకు,
దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు, మరియు కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ఒంటరి మహిళ లకు ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు, కిరాణా షాపులు, ఫ్యాన్సీ స్టోర్ లు, పెట్టుకోవడానికి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించుట కొరకు, సోలార్ ద్వారా తమ పంట పొలాలలో విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు.
గిరిజన దర్బార్ లో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు విడతల వారీగా ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ డి సి రవీంద్రనాథ్, ఆర్ సి ఓ గురుకులం నాగార్జున రావు, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఎస్ ఓ భాస్కర్, పి వి టి జి అధికారి మణిధర్, ఎఫ్ డి సి ఉదయ కుమార్ , మేనేజర్ ఆదినారాయణ, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ప్రమీలబాయ్, సౌమ్య, జోగారావు తదితరులు పాల్గొన్నారు.