calender_icon.png 28 September, 2024 | 6:54 AM

పువ్వాడ అజయ్ పిటిషన్ కొట్టివేత

28-09-2024 02:42:11 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): 2014 ఎన్నికల సమయం లో పువ్వాడ అజయ్‌కుమార్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ నమోదైన కేసును కొట్టివేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మద్యం, క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారంటూ ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2014 ఏప్రిల్ 28న ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసును కొట్టివేయాలంటూ 2014లో పువ్వాడ అజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ క్రికెట్ కిట్ల పంపిణీతో ఎలాంటి సంబంధంలేదని తెలిపారు. వసతి గృహంలో స్వాధీనం చేసుకున్న కిట్లు తనకు చెందినవని తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి ఫిర్యాదులోని అంశాలు విచారణలో తేలాల్సిందేనంటూ పువ్వాడ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.