calender_icon.png 15 October, 2024 | 5:56 AM

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

15-10-2024 01:01:21 AM

రాజేంద్రనగర్, అక్టోబర్ 14: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు సోమవారం కొట్టివేసింది. తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు ఆయనపై లైంగిక దాడి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఇదిలా ఉండగా, కొన్నిరోజుల క్రితం ఆయన తాను అవార్డు తీసుకోవాల్సి ఉందని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేయడంతో ఈ నెల 6వ తేదీ నుంచి 10 వరకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

అయితే, జానీ మాస్టర్‌పై కేసు నమోదై పోలీసులు రిమాండ్‌కు తరలించిన నేపథ్యంలో కమిటీ అవార్డును రద్దు చేయడంతో మధ్యంతర బెయిల్ వినియోగించుకోబోనని ఆయన కోర్టుకు మెమో సమర్పించారు. తిరిగి రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా న్యాయమూర్తి తిరస్కరించారు.