calender_icon.png 13 December, 2024 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంధ్య థియేటర్ కేసు కొట్టివేయండి

12-12-2024 01:21:07 AM

హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): పుష్ప2 సినిమా ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాట వల్ల ఓ మహిళ మృతి చెందిన ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సినీ నటుడు అల్లు అర్జున్ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అల్లు అర్జున్ రాక కారణంగా తొక్కిసలాటలో తన భార్య రేవతి మృతిచెందిందని, కుమారుడు, కుమార్తె గాయపడ్డారని ఎం భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు నమోదు చేయడం చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని  పిటిషన్‌లో  పేర్కొన్నారు. పుష్ప2 సినిమాపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారని తెలిపారు.

ఈ నేపథ్యంలో దురదృష్టకర ఘటన చేసుకుందని, ఇందులో మహిళ మృతిచెందడం బాధాకరమని అన్నారు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్‌కు రావడం సహజమేనని చెప్పారు. గతంలోనూ పలుమార్లు సినిమా ప్రదర్శనల సమయంలో హాజరైనా, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు.

తన రాక గురించి థియేటర్ నిర్వాహకులకు, ఏసీపీ తదితర పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ఇందులో తన నిర్లక్ష్యమేమీ లేదని, భద్రత కోసం ముందస్తుగా సమాచారం ఇచ్చినట్టు తెలిపారు.

ఫిర్యాదుదారు ఆరోపణలు అవాస్తవమని, కేవలం తన రాక కారణంగానే ఈ ఘటన జరిగిందని, దీనికి తానే బాధ్యుడని పేర్కొనడం సరికాదన్నారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, అరెస్టు సహా విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని విజ్ఞప్తిచేశారు.