- భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ నేతల మధ్య గలాట
- పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య మొదలైన గొడవ చిలికిచిలికి పెద్ద గొడవకు దారితీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు రెండువర్గాలుగా విడిపోయి.. కొట్టుకోవడంతో గాందీభవన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బుధవారం గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ముఖ్యనాయకులు హాజరయ్యారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని పార్టీలో మొదటి నుంచి పని చేసినవారికి కాకుండా.. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన సీహెచ్ కార్తీక్‌కు ఎలా ఇస్తారని సుధీర్, ఆయన అనుచరులు ఆందోళనకు దిగడంతో ఘర్షణ మొదలైంది.
మాటామాటా పెరిగి.. ఇరువర్గాల నేతలు గాంధీభవన్ ఆవరణలోనే పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడిలో సుధీర్, సన్ని అనే ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం. వెంటనే అక్కడనే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.
పీసీసీ చీఫ్ సీరియస్..
గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతల గొడవపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సీరియస్ అయినట్లు తెలిసింది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఏకంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో తన్నుకోవడం ఏంటని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇటీవల నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడి సమయంలోనూ యూత్ కాంగ్రెస్ నేతల తీరుపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా గాంధీభవన్‌లో జరిగిన గొడవకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
మొదటి నుంచి ఉన్నవారికి విలువేది
యూత్ కాంగ్రెస్‌లో కొత్తగా వచ్చిన వారికి పదవులిచ్చి.. పార్టీనే నమ్ముకొని ఇన్ని రోజులు పనిచేసిన పాతవారిని పట్టించుకో కవడం సరికాదు. బీఆర్‌ఎస్ నుం చి వచ్చిన కార్తీక్‌కు యూత్ కాంగ్రెస్‌లో పోటీ చేసే అర్హత లేకున్నా.. జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.
యూత్ కాంగ్రెస్‌లో పోటీ చేసేందుకు 35 ఏళ్లు దాటొద్దని, కానీ ఆయనకు 38 ఏళ్లు నిండాయన్నారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో పని చేస్తున్న తమకు పార్టీలో విలువ ఇవ్వడం లేదన్నారు. ఇదే అంశాన్ని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశామని సుధీర్ చెప్పారు.
సుధీర్, భద్రాద్రి
జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సుధీర్