calender_icon.png 24 December, 2024 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక వేడితో వ్యాధుల ముప్పు?

04-11-2024 01:44:47 AM

  1. విజృంభిస్తోన్న డెంగ్యూ, మలేరియా వ్యాధులు 
  2. వాతావరణ మార్పులతో ఎదురవుతోన్న ఇబ్బందులు
  3. కేసారి తీవ్ర కరువు, భారీ వరదలు దీని ప్రభావమే
  4. లాన్సెట్ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, నవంబర్ 3: భారత్‌లో అనూహ్య వాతావరణంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. హిమాలయ ప్రాంతం లో మలేరియా అధికంగా వ్యాప్తి చెందుతుండగా దేశమంతా డెంగ్యూ స్వైర విహారం చేస్తోంది. ఆరోగ్యం, వాతావరణ మార్పులపై 122 మంది నిపుణులతో లాన్సెట్ సంస్థ చేసిన అధ్యయనంలో కీలక అంశాలు వెల్లడయ్యాయి.

ఈ వ్యాధుల వ్యాప్తితో దేశంలో వాతావరణంపై సమగ్ర అంచనా, ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాల మెరుగు దల, సమాజంలో అవగాహన పెంచడంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు సైతం సముద్రమట్టాలు పెరగడం వల్ల ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది.

ఈ ప్రాంతాల్లో వరదల ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు అవసరమని తెలిపింది. వాతావరణ మార్పులతో కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. 

విజృంభిస్తోన్న వ్యాధులు

2023లో హెల్త్ రిస్కులను సూచించే 15 సూచికల్లో 10 ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు లాన్సెట్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది అత్యంత వేడి నమోదైంది. మానవ ఆరోగ్యానికి హాని కలిగించేలా 50 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన కరువులు, హీట్‌వేవ్, కార్చిచ్చులు తుపానులు, వరదలు ఏర్పడ్డాయి.

1990 లతో పోలిస్తే ఉష్ణోగ్రత కారణంగా 65 ఏళ్లు పైబడిన వారి మరణాలు 167 శాతం పెరిగాయి. వ్యక్తులు సగటున 1,512 గంటలు అధిక ఉష్ణోగ్రతలకు లోనవుతున్నారు. ఇది గత 30 ఏళ్లతో పోలిస్తే 27.7 శాతం అధికం. ఫలితంగా 512 వందల కోట్ల పనిగంటలతో పాటు 835 బిలియన్ డాలర్ల ఆదాయం తగ్గింది. 2014 మధ్య 61 శాతం భారీ వర్షపాతం కారణంగా వరదలు సంభవించి వివిధ వ్యాధులకు కారణమయ్యాయి. 

ఆహార భద్రతపైనా ప్రభావం

ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు కూడా అధికమవుతాయి. 2023లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 50 లక్షల మంది వీటి బారిన పడ్డారు. ఈ వ్యాధులు ఎప్పుడు వ్యాప్తి చెందని ప్రాంతాల్లో విజృంభిస్తున్నాయి. అంతేకాకుండా వాతావరణ మార్పులతో ప్రపంచంలోని భూభాగంలో 48 శాతం తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 1951 తర్వాత ఇదే అత్యధికం.

ఈ పరిస్థితులు పంట దిగుబడి, నీటి సరఫరా, ఆహార భద్రతపై ప్రభావం చూపాయి. 1981-2010 మధ్య 124 దేశాల్లోని 15.1 కోట్ల మంది ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ చొరవ కారణంగా వాయుకాలుష్యంతో మరణించేవారి సంఖ్య తగ్గుతోందని లాన్సెట్ తెలిపింది.