calender_icon.png 23 October, 2024 | 9:04 AM

చర్చలు ముగిసాయి, చర్యలే తరువాయి

08-07-2024 01:11:21 AM

2024 బడ్జెట్‌పై కేంద్ర ఆర్థికశాఖ వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 7: ప్రస్తుత  2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ కోసం వివిధ పక్షాలతో ముందస్తు చర్చల్ని  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిచేశారని కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం తెలిపింది. సీతారామన్ తన ఏడవ బడ్జెట్‌ను జూలై 23న లోక్‌సభలో ప్రవేశపెడతారు. బడ్జెట్ కోసం నిర్దేశించిన పార్లమెంటు సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 22 వరకూ కొనసాగుతాయి. సాధారణంగా బడ్జెట్ ముందురోజున వెలువడే ఆర్థిక సర్వే జూలై 22న వస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పరిశ్రమ, సామాజిక రంగ ప్రతినిధులతో జరిపిన సంప్రదింపులు జూన్ 19న మొదలై జూలై 5తో ముగిసినట్టు ఆర్థిక శాఖ పేర్కొంది.

ఆర్థిక శాఖ తాజా ప్రకటన నేపథ్యంలో బడ్జెట్లో మోది 3.0 ప్రభుత్వం ప్రకటించే ప్రతిపాదనలపై అంచనాలు జోరందుకున్నాయి. 2047 సంవత్సరానికల్లా భారత్‌ను ధనికదేశంగా రూపొందించే లక్ష్యంతో ఈ బడ్జెట్లో గణనీయమైన ఆర్థిక, సామాజిక నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకుంటుందని, పలు చరిత్రాత్మక చర్యల్ని చేపడుతుందని  గత నెల లో కొత్త పార్లమెంటు ప్రారంభ సమావేశం లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనాప్రాయంగా వెల్లడించిన నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనలపై విశ్లేషకుల్లో ఆసక్తి పెరిగింది. 

సిఫార్సులు, సూచనల్ని అనుసరిస్తాం: సీతారామన్

ఆర్థికమంత్రి సీతారామన్ బడ్జెట్ ముందస్తు చర్చల్లో భాగంగా నిపుణులు, ఆర్థిక వేత్తలు రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, విద్య, ఆరోగ్య, ఉపాధి కల్పన, ఎంఎస్‌ఎంఈలు, పారిశ్రామిక, ఆర్థిక, మౌలిక రంగాల ప్రతినిధులతో సమావేశాలు జరిపారు.  ఈ సంప్రదింపుల్లో ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరితో పాటు సీనియర్ అధికారులైన ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, దీపం కార్యదర్శి తుహిన్‌కాంత్ పాండే, ఫైనాన్షియల్ సర్వీసుల కార్యదర్శి వివేక్ జోషి, రెవిన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాలు పాల్గొన్నారు. చర్చల్లో పాల్గొని విలువైన సూచనలు, సలహాలు ఇచ్చినవారికి సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. వివిధ రంగాల ప్రతినిధులు, నిపుణులు చేసిన సూచనలు, సిఫార్సులను క్షుణ్ణంగా సమీక్షించి 2024 కేంద్ర బడ్జెట్ రూప కల్పనలో పరిగణనలోకి తీసుకుంటామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. 

కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడెక్షన్ రెట్టింపు చేయాలి

కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడెక్షన్‌ను వచ్చే బడ్జెట్లో రెట్టింపు చేయాలని కన్స ల్టెన్సీ సంస్థ ఎర్న్‌స్ అండ్ యంగ్ (ఈవై) ప్రభుత్వాన్ని కోరింది. కీలకమైన పన్నుల సంస్కరణలను ఈవై ప్రస్తావిస్తూ కొత్త పన్ను విధానంలో ప్రస్తుతం అమలవుతున్న రూ. 50,000 స్టాండర్డ్ డిడెక్షన్‌ను రూ.1 లక్షకు పెంచాలని లేదా బేసిక్ పన్ను మినహాయింపును రూ.3 లక్షల నుంచి రూ. 3.5 లక్షలకు పెంచాలని కోరింది. అలాగే కార్పొరేట్ పన్ను రేట్లలో స్థిరత్వాన్ని కొనసాగించాలని, టీడీఎస్ ప్రొవిజన్లను హేతుబద్దీకరించాలని, పన్ను వివాదాల పరిష్కారం సజావుగా జరిగే చర్యల్ని బడ్జెట్లో ప్రతిపాదించాలని కన్సల్టెన్సీ సంస్థ సూచించింది.