calender_icon.png 23 October, 2024 | 12:55 AM

సనాతనంపై సంవాదం

23-10-2024 12:00:00 AM

దక్షిణ భారతదేశ రాజకీయాల్లో మతానికి చాలా తక్కువ చోటు ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో రాజకీయాల్లో ఇంతకాలం మతాన్ని పెద్దగా సమ్మిళితం చేయలేదు. కర్ణాటకలో బీజేపీ పాలన వచ్చిన తర్వాత మత ప్రభావం కాస్త పెరిగినప్పటికీ ఇప్పటికీ ఈ అన్ని రాష్ట్రాల్లో పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధే ప్రధాన అంశంగా ఉన్నది. ఎన్నికల సమయాల్లో ప్రచారం కూడా అభివృద్ధిపైనే సాగుతూ వస్తున్నది. కానీ, ఇప్పుడు ఇక్కడి రాజకీయాలు సనాతనం వైపు మళ్లుతున్నాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై విమర్శలు చేసిన తర్వాత కూడా పెద్దగా చర్చ జరుగలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ తనదైన మేనరిజంతో సనాతన ధర్మానికి తానే తిరుగులేని రక్షకుడిని అన్న ట్లుగా ఇటీవల చేసిన ప్రకటనతో ఈ అంశంపై చర్చ జోరందుకొన్నది. దీంతో ఉదయనిధి కూడా మరోసారి స్పందించారు. సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ప్రకటించారు. తాను కలైంజ్ఞర్ కరుణానిధి మనుమడిని, ఎవరికీ క్షమాపణ చెప్పనని ఉద్ఘాటించారు. దీంతో సనాతనంపై చర్చ మరింత ఊపందుకొన్నది. 

సనాతన ధర్మానికి రక్షకులమని కొందరు, దానిని ధ్వంసం చేయాలన్నట్లుగా మరికొందరు ప్రకటిస్తూ పని గట్టుకొని వివాదాలు సృష్టించటంపై మత పెద్దలు, పీఠాధిపతులు కూడా మండి పడుతున్నారు. సనాతన ధర్మా న్ని రాజకీయ నాయకులు రక్షించాల్సిన అవసరం లేదని, అందుకు తాము ఉన్నామని జ్యోతిర్మఠ్ పీఠాధిపతి స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి గట్టిగానే చురకలు అంటించారు. నిజానికి రాజకీయ నాయకులకు మతం తో సంబంధం లేదు. వారు చూడాల్సింది ప్రజల సంక్షేమాన్ని! స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి కూడా అదే విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తు తం సనాతన ధర్మానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ గొంతులు చించుకొంటున్న రాజకీయ నాయకులు ఎప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటారని కూడా చెప్పలేం. అవసరానికి తగ్గట్టుగా మాట మార్చటం రాజకీయ నాయకులు తమ జన్మహక్కుగా భావిస్తారు. ఉదయనిధి స్టాలిన్ తాత, సనాతన ధర్మాన్ని తీవ్రంగా విమర్శించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా ఒకప్పుడు మూఢ నమ్మకాలను పాటించారు. ఆయన ఎన్నికల సమయంలో గుడుల చుట్టూ తిరిగిన సందర్భం కూడా ఉన్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి హిందువుల ఓట్లకోసం ఉదయనిధి మాట మార్చరన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. ఇక, ఇప్పుడు సనా తన ధర్మంపై పేటెంట్ కోసం అన్నట్లుగా మాట్లాడుతున్న ఆంధ్ర డిప్యూటీ సీఎం ఒకప్పుడు తాను పక్కా కమ్యూనిస్టునని చెప్పుకొన్న వారే. ఇప్పుడు పంథా మార్చుకొని దీక్షలు చేస్తున్నారు. ఐతే, ఆ స్వేచ్ఛ ఆయనకు ఉన్నది. 

ప్రస్తుతం దేశంలోని 140 కోట్ల జనాభాలో దాదాపు సగం వరకు మధ్యతరగతి వర్గం వారే ఉన్నారు. మతాలను ఆదరించేది, కాపాడేదీ వీరే. మతానికి త్వరగా ఆకర్షితులయ్యేది కూడా వీరే. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నట్లుండి సనాతనాన్ని ఎత్తుకోవటం వెనుక కూడా పక్కా రాజకీ యమే ఉన్నదని అర్థమవుతున్నది. తమిళనాడులో డ్రవిడ ఉద్యమానికి ప్రజలు త్వరగా ఆకర్షితులవుతారు. కరుణానిధి చనిపోయిన తర్వాత అక్క డ ద్రవిడ ఉద్యమానికి బలమైన నాయకుడు లేకుండా పోయాడు. తాను ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఉదయనిధి ఉవ్విళ్లూరుతున్నారు. కరుణానిధి లాగే ఈయన కూడా తమిళ సినిమాతో దగ్గరి సంబంధం ఉన్నవారే. సనాతనంపై వివాదాస్పద ప్రకటనలు చేసిన తర్వాతే ఉదయనిధికి దేశ వ్యాప్తంగా ప్రచారం వచ్చింది. డిఫ్యూటీ సీఎం పదవి సైతం వచ్చింది. ఇక ఆంధ్రలో గత వైసీపీ ప్రభుత్వం హిందూమతంపై, ఆలయాలపై వివక్ష చూపిందని చెప్పటానికే పవన్ కల్యాణ్ ఇటీవల దీక్షలు చేశారన్నది బహిరంగ రహస్యమే. తిరుపతిలో కల్తీ నెయ్యి రాజకీయం సుప్రీంకోర్టు జోక్యంతో ఎక్కువ కాలం సాగలేదు. వచ్చే ఎన్నికల నాటికి ఈ సనాతన ధర్మ రాజకీయం తెలంగాణ, కేరళకు కూడా పాకినా ఆశ్చర్యం లేదు.