03-03-2025 06:31:55 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్(Union Minister for Water Resources C.R. Patil)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Irrigation Minister Uttam Kumar Reddy) సోమవారం భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని మేజర్ సాగునీటి ప్రాజెక్టులపై చర్చించామన్నారు. నీటి కేటాయింపులు, వినియోగంలో సమస్యలను కేంద్రమంత్రికి వివరించామని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కూడా కేటాయింపులు చేపట్టాలని కోరామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసినప్పుడు కూడా గోదావరి-మూసీ అనుసంధానం విషయం గురించి, ఎస్ఎల్బీసీ ప్రమాదం గురించి కూడా చెప్పినట్లు గుర్తు చేశారు.
పాలమూరు- రంగారెడ్డి, సమ్మక్క-సారక్క, సీతారామ, ఇతర ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇంకా జరగలేదని, చేయాలని అడిగినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేసిన్ నుంచి అధిక నీటిని వినియోగిస్తుందని ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీరు తీసుకోకుండా అడ్డుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న బనకచర్లపై తామ అభ్యంతరం తెలియజేశామని రేవంత్ రెడ్డి ఈ సందర్భం పేర్కొన్నారు.