calender_icon.png 26 October, 2024 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణాదిపె వివక్ష

26-10-2024 02:16:21 AM

నిధుల విషయంలో కేంద్రం చిన్నచూపు

  1. న్యాయ పోరాటానికి నేను నాయకత్వం వహిస్తా
  2. రూపాయి వెళ్తే వెనక్కు వస్తున్నది ౪౦ పైసలే
  3. అదే యూపీ, బీహార్‌కు ఆరేడు రూపాయలు
  4. మోదీ పదేండ్లలో చేసింది పార్టీలను చీల్చడమే
  5. జనాలు గులాంలని కేసీఆర్ భావిస్తున్నారు
  6. బాపూ ఘాట్ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ  
  7. సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ఎన్డీయే ప్రభుత్వ హయాంలో దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. దేశాభివృద్ధిలో తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అయినా కేంద్రం ఈ రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

శుక్రవారం హైదరాబాద్‌లో ఓ జాతీయ న్యూస్ నెట్‌వర్క్ నిర్వహించిన ‘సదరన్ రైజింగ్ సమ్మిట్’ను సీఎం ప్రారంభించి మాట్లాడారు. మోదీ సర్కారు వివక్షపై దక్షిణాది రాష్ట్రాలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జనాభా ప్రాతిపాదిక కాకుండా, పన్నుల వాటా ఆధారంగా నిధులను రాష్ట్రాలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల న్యాయ పోరాటానికి అవసరమైతే తాను నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. 

కాంగ్రెస్ హయాంలో ఉత్తరాదితోపాటు దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఎంతో మేలు జరిగిందని సీఎం తెలిపారు. గతంలో ఉత్తరాది నుంచి ప్రధాని ఉంటే, దక్షిణాది నుంచి రాష్ర్టపతిని చేసే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పాటించిందని చెప్పారు. మోదీ హయాంలో ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదని విమర్శించారు. కేంద్రంలో అధికారం కోసమే బీజేపీ దక్షిణాదిలో ఎదగడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

‘దక్షిణాది ఐదు రాష్ట్రాల నుంచి కేంద్రం పెద్ద ఎత్తున పన్నులు తీసుకుంటోంది. కానీ ఈ రాష్ట్రాలకు నిధులు తిరిగి ఇచ్చే విషయంలో మాత్రం చిన్నచూపు చూస్తోంది. దక్షణాది రాష్ట్రాలకు పెద్దగా నిధులు ఇవ్వని మోదీ.. ఇక్కడి ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారు? పన్నుల రూపంలో కేంద్రానికి తాము ఒక్క రూపాయి పంపిస్తే రూ.40 పైసలు మాత్రమే తిరిగి వెనక్కి వస్తున్నది. అదే ఉత్తరప్రదేశ్ ఇచ్చే ప్రతి రూపాయికి తిరిగా ఆ రాష్ట్రానికి కేంద్రం రూ.7, బీహార్‌కు రూ.6 ఇస్తున్నది’ అని తెలిపారు.   

ఎన్నో విప్లవాత్మక మార్పులు 

కాంగ్రెస్, యూపీఏ హయాంలో దేశంలో ఎన్నో విప్లమాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ వివరించారు. భాక్రానంగల్ నుంచి, నాగార్జునసాగర్ వరకు ఎన్నో ప్రాజెక్టులు, కొత్త యూనివర్సిటీలను నిర్మించినట్లు చెప్పారు. ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హఠావో నినాదంతో ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

రాజీవ్‌గాంధీ హయాంలో ఓటింగ్ వయసును తగ్గించడం, కంప్యూటర్లతో ఐటీ విప్లవానికి నాంది పలికి, టెలికం రంగంలో మార్పులు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. దక్షిణాది నుంచి ప్రధానిగా సేవలు అందించిన పీవీ నరసింహారావు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌తో కష్టాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారని తెలిపారు.

మన్మోహన్ సింగ్ కాలంలో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. మూడోసారి ప్రధాని అయిన నరేంద్రమోదీ దేశ ప్రజల కోసం ఏ రెవల్యూషన్ తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఎవరికి ప్రయోజనం చేకూర్చారో చెప్పాలని సవాల్ విసిరారు. పార్టీలను చీల్చడం, భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం, ప్రభుత్వాలను పడగొట్టడం తప్పితే.. ప్రజలకు ప్రధాని మోదీ, బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు.

కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదు?

పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ ఒక్కసారి సచివాలయానికి రాలేదని, గత పది నెలల్లో ఒక్కసారి కూడా ఆయన అసెంబ్లీకి రాలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష హోదాలో ఒకసారి అసెంబ్లీకి వచ్చి పది నిమిషాలు అసెంబ్లీలో కూర్చుని వెళ్లిపోయారని గుర్తుచేశారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు.

తానో జమీందార్, ప్రజలందరూ గులాంలని కేసీఆర్ భావిస్తుంటారని ఆరోపించారు. అందుకే ఆయన బయటకు రావడం లేదని అన్నారు. తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలు ఎన్నుకుంటేనే తాము అధికారంలోకి వచ్చామని అన్నారు. ‘మీకు నచ్చకుంటే ఇంట్లో కూర్చోండి. మా ప్రభుత్వాన్ని పని చేయనివ్వండి’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్లంమెట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ప్రజల ఆలోచనను కేసీఆర్ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ప్రజల ఆలోచనను పట్టించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సర్కారును పడగొట్టాలని చూశారని, కానీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే తమకు మద్దతుగా నిలిచారని తెలిపారు. 

బాపూఘాట్ అభివృద్ధి

గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూఘాట్‌గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రపంచమంతా హైదరాబాద్‌వైపు చూసేలా బాపూఘాట్‌ను అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈసీ, మూసీ నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉందని, గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మాదిరిగా బాపూ ఘాట్‌లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూసీ పునరుజ్జీవాన్ని, బాపూఘాట్ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. మహాత్ముడి వారసులుగా తాము బాపూఘాట్‌ను అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు.

మూసీ పునరుజ్జీవాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ప్రశ్నించారు. వారు గుజరాత్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్ నిర్మించుకోవచ్చు కానీ, తాము మాత్రం మూసీ పునరుజ్జీవం చేస్తామంటే అడ్డుకోవడం ఎందుకని నిలదీశారు.

ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రాడార్, ఇరిగేషన్ ప్రాజెక్టులతో తెలంగాణ పురోగతి సాధించి గుజరాత్‌కు పోటీ ఇస్తుందనే విషయం తెలిసే అభివృద్ధిని అడ్డుకునేందుకే బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే బీఆర్‌ఎస్ వ్యతిరేకించిన మరుసటి రోజునే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి స్పందిస్తున్నారని అన్నారు. తాము ప్యూచర్ సిటీని నిర్మిస్తే వారికొచ్చిన సమస్య ఏంటని సీఎం నిలదీశారు.