calender_icon.png 24 October, 2024 | 8:45 PM

‘ఆజామాబాద్’ విద్యుత్‌శాఖలో వివక్ష?

12-07-2024 12:08:30 AM

సబ్ ఇంజినీర్ టేబుల్‌ను హాల్లోకి మార్చిన అధికారి

తనపై వివక్ష చూపుతున్నారంటూ బాధితుడి ఫిర్యాదు

‘మింట్’కు చేరిన పంచాయితీ

బాధితుడిపైనే విచారణకు ఆదేశించడంపై పెదవి విరుపు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): హైదరాబాద్ విద్యుత్‌శాఖ మెట్రోజోన్ పరిధిలోని ఆజామాబాద్ డివిజన్‌లో ఇద్దరు అధికారుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు ఈ శాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఓ అధికారి, సబ్ ఇంజినీర్ మధ్య కొన్నాళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని, పనుల మంజూరుతో పాటు ఇతర వ్యవహారాల్లో వీరి మధ్య తేడాలు వచ్చాయని తెలుస్తోంది. ఒకే గదిలో విధులు నిర్వహించాల్సిన వీరిద్దరూ, ఏడాది నుంచి కనీసం మాట్లాడుకోవడం లేదని సమాచారం. ఈ క్రమంలో కార్యాలయంలోని సబ్ ఇంజినీర్ టేబుల్‌ను ఆ అధికారి హాలులో పెట్టించి, తర్వాత ఆయన కార్యాలయానికి తాళం వేసి కొన్ని రోజులు సెలవుపై వెళ్లినట్లు సమాచారం. ఈ వివాదం కాస్తా ప్రధాన కార్యాలయమైన మింట్ కాంపౌండ్‌కు చేరగా, ప్రస్తుతం ఈ విషయం విద్యుత్ ఉద్యోగుల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 

విద్యుత్ శాఖలో వివక్ష.. 

సబ్‌ఇంజినీర్ ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేసినప్పటికీ వారు కూడా ఆ అధికారికే మద్దతుగా నిలుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆధిపత్య వర్గానికి చెందిన ఆ అధికారి తన కింది స్థాయి అధికారులు, సిబ్బంది పట్ల వివక్ష చూపి స్తున్నారని, బలహీనవర్గానికి చెందిన సబ్ ఇంజినీర్‌పైనా ఇదే వైఖరి అవలంబిస్తున్నారనే ఆ శాఖ ఉద్యోగులు అసహనంగా ఉన్నట్లు సమాచారం. కొందరు సీనియర్ అధికారులు సదరు ఏఈకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆయన ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ఇదే కార్యాలయంలోని రెండో అంతస్తులో డివిజన్ కార్యా లయం ఉన్నా, డీఈ చోద్యం చూస్తుండటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులపై వివక్షను అడ్డుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అదే కారణమా..?

ఆజామాబాద్ డివిజన్‌లో ప్యానల్ బో ర్డు ఎలాంటి రీ  ఎస్టీమేషన్ లేకుండానే అదనపు మీటర్లు మంజూరు చేస్తున్న విషయంపై  ఈ నెల 2న ‘విద్యుత్ శాఖలో ఇం టి దొంగలు’ అనే శీర్షికన ‘విజయక్రాంతి’ లో కథనం ప్రచురితమైంది. తన గుట్టుబయపడిందని భావించిన ఆ అధికారి కిం దిస్థాయి ఉద్యోగులను వేధిస్తున్నట్లు భొగట్టా. దీనిలో భాగంగానే సబ్ ఇంజినీర్‌పైనా సామాజిక వివక్ష చూపుతున్నట్లు సిబ్బంది చర్చించుకుంటున్నారు. దౌర్జన్యంగా సబ్‌ఇంజినీర్ టేబుల్‌ను బయటపడేసినా అధికారిపై చర్యలు తీసుకోకుండా, తిరిగి సబ్ ఇంజినీర్‌పైనే ఫిర్యాదు చేయించడంపై సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడిపైనే విచారణకు ఆదేశించడంపై పెదవి విరుస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై ఆజామాబాద్ డివిజన్ వ్యవహారాలపై విజిలెన్స్ అధికారులు సైతం ఓ కన్నేసినట్లు సమాచారం.