calender_icon.png 10 January, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విగ్రహాల్లోనూ వివక్ష

08-01-2025 12:00:00 AM

తెలంగాణ తల్లి.. ఈ పేరు అంటేనే తెలంగాణలో నాలుగు కోట్లకు పైగా ఉన్న ప్రజలకు ఓ ఆరాధ్య దైవం. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన కోసం జరుగుతున్న ఉద్యమ కాలంలో అప్పటి టీఆర్‌ఎస్ ప్రస్తుత బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, ఉద్యమకారులు, మేధావులు కలిసి తెలంగాణ తల్లికి ఓ రూపాన్ని ఇచ్చి గ్రామ గ్రామాన నెలకొల్పారు. ఇదే తరుణంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సైతం ఆర్భాటంగా నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహానికి తీవ్ర అవమానం జరిగింది.  

2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించాక అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుతంలో ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగు రామన్న మంత్రిగా బాధ్యతలను సీకరించారు. దీంతో ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి నిధులను తీసుకువచ్చి రహదారుల వెడల్పు, చౌరస్తాలా పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇదే క్రమంలో ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించి అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ పనులు పూర్తయ్యాక ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పారు కానీ తెలంగాణ తల్లిని మాత్రం చెత్తకుప్పలో వదిలేశారు. 

ఉద్యమంలో భాగంగా.. 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లికి తీవ్ర అవమానం జరిగింది. తెలంగాణ రాష్ర్టం కోసం ఉద్యమం ఉవెత్తున ఎగిసిపడుతున్న రోజుల్లో  ఆదిలాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుడు కారింగుల దామోదర్ ఆధర్యంలో రాష్టంలోనే ఎక్కడ లేని విధంగా దీర్ఘకాలంగా 1,523 రోజులపాటు శిబిరాన్ని కొనసాగించారు. ఇదే తరుణంలో ఉద్యమకారులు అందరూ కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పారు.

అయితే రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా విగ్రహాన్ని తొలగించిన అప్పటి ప్రజా ప్రతినిధులు, అధికారులు తిరిగి విగ్రహాన్ని యధా స్థానంలో నెలకొల్పకుండా చెత్త కుప్పల్లో ఉండటంతో తెలంగాణ తల్లికి తీవ్ర అవమానం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

విగ్రహం పట్ల వివక్ష..

ఆదిలాబాద్ పట్టణంలోని అప్పటి ఎన్టీఆర్ చౌక్ ను తెలంగాణ ఉద్యమ సమయంలో  తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణ చౌక్‌గా నామకరణం చేసి, ఉద్యమాలు చేపట్టారు. అప్పటి నుంచి తెలంగాణ రాష్ర్టం ఆవిర్భావం అయ్యేవరకు ఆ చౌక్ లో ప్రతినిత్యం ఆందోళనలు కొనసాగుతూనే ఉండేవి. టీడీపీ నాయకుల ఒత్తిడితో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పిన అప్పటి ప్రజాప్రతినిధులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం పెట్టలేదు. 

2012లో ఆవిష్కరణ

తెలంగాణ రాష్ర్టం కోసం ఉవెత్తున పోరాటం జరుగుతున్న రోజుల్లో రాష్ర్టంలో పలుచోట్ల తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకున్న ఆదిలాబాద్ ఉద్యమకారులు సైతం ఆదిలాబాద్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

దాంతో ఉద్యమకారులు డబ్బులు సేకరించి.. జూన్ 22, 2012లో తెలంగాణ ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ కోదండరాం చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. అప్పటి వరకు ఎన్టీఆర్ చౌక్ గా పిలువబడే ఆ చౌరస్తా కాస్త అప్పటి నుండి తెలంగాణ చౌరస్తా గా మారిపోయింది. అలా ప్రతినిత్యం అక్కడే ఉద్యమకారులు తమ ఆందోళనలను కొనసాగించేవారు.  

వెంకటేశ్, ఆదిలాబాద్

విగ్రహాన్ని నెలకొల్పే వరకు ఉద్యమం

పట్టణ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ తల్లి చౌరస్తాలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించిన అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు పనుల తరాత ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పారు, కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పకుండా తల్లిని అవమానించారు.

ఉద్యమ సమయంలో ఉద్యమకారులు అందరం కలిసి రూపాయి రూపాయి పోగు చేసుకొని ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి ప్రస్తుతం చెత్తకుప్పల్లో వేయడం తెలంగాణ సమాజానికి అవమానకరం. అధికారులు తిరిగి యధాస్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పే వరకు ఉద్యమకారులందరం కలిసి మళీ ఉద్యమాలు చేపడతాం.

 కారంగుల దామోదర్, ఉద్యమకారుడు