calender_icon.png 8 April, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండ పడింది!

08-04-2025 01:35:53 AM

వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 50 వడ్డన

  1. ‘ఉజ్వల’ లబ్ధిదారులకూ వర్తింపు.. నేటినుంచే అమలు
  2. పెట్రోల్, డీజిల్‌పై సుంకం పెంపు.. భారం చమురు కంపెనీలదే

సిలిండర్ రకం   పాత ధర కొత్త ధర

సాధారణ             రూ.803 రూ.853 

ఉజ్వల              రూ.503 రూ.553

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కేంద్రం షాక్‌నిచ్చింది. వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచు తూ సోమవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ను గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు పెంచలేదని, తాజాగా రూ.50 చొప్పున పెంచుతున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహాయ వాయువులశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి సోమవారం ప్రకటించారు.

ధరల పెంపు ఉజ్వల పథకం లబ్ధిదారులకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. పెరిగిన ధరలు మంగళవారం నుంచే (ఏప్రిల్ 8) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ధరల పెంపుతో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.803 నుంచి రూ.853కు, ఉజ్వల పథకం కింద సిలిండర్ ధర రూ.503 నుంచి రూ.553కు పెరగనున్నదని వెల్లడించారు.

మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ గ్యాస్ ధర గతవారంలో రూ.41 మేర తగ్గిందని తెలిపారు. ఇకపై సిలిండర్ ధరలపై కేంద్రం 15 రోజులు లేదా నెలకోసారి సమీక్షిస్తుందని వివరించారు.

సిలిండర్ ధరలపై పెంపుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘దోపీడీ, మోసం అనే పదాలకు పర్యాయ పదం మోదీ ప్రభుత్వం.. ఉజ్వల సిలిండర్‌ను వినియోగించే నిరుపేదలను సైతం కేంద్ర ప్రభుత్వం వదలడం లేదు. వారిపైనా ద్రవ్యోల్బన కొరడా ఝుళిపించడం దారుణం’ అని అన్నారు.

పెట్రోల్, డీజిల్‌పై రూ.2 ఎక్సైజ్ సుంకం పెంపు..

పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పెంచిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే.. ఈ భారం వాహనదారులపై పడదని, సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని తేల్చిచెప్పింది.