calender_icon.png 26 March, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీకర్ వ్యాఖ్యలతో మనోవేదన

26-03-2025 12:53:59 AM

  1. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
  2. వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు స్పీకర్ స్పష్టీకరణ

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం రాత్రి జరిగిన చర్చలో స్పీకర్ తనపై చేసిన వ్యాఖ్యలు మనోవేదనకు గురి చేశాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకే వినాలనిపిస్తలేదు... వాళ్లెలా వింటున్నారో నాకు అర్థం కావడం లేదు’ అంటూ స్పీకర్ పలికిన మాటలు తనను బాధించాయన్నారు.

ప్రసంగంలో ఎక్కడా పరిధి దాటి మాట్లాడలేదని, కానీ స్పీకర్ తనపట్ల అలా మాట్లాడటం అవమానం కలిగించిందని సునీత పేర్కొన్నారు. తన విషయంలో చేసిన వ్యాఖ్యలు సబబు అనిపిస్తే రికార్డులో ఉంచాలని లేదంటే తొలగించాలని స్పీకర్‌ను కోరారు. సునీత వ్యాఖ్యలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందిస్తూ.. సునీతా లక్ష్మారెడ్డి అంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు.

తనకు 8 మంది సోదరీమణులు ఉన్నారని, మహిళలను ఎక్కువగా గౌరవిస్తానన్నారు. స్పీకర్ కుర్చీలో నుంచి తాను పలికిన మాటలను సునీత తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. సునీత మాట్లాడుతున్న సమయంలో ఇరు వైపుల నుంచి రన్నింగ్ కామెంటరీ రావడంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని, ఆమెను ఉద్దేశించి కాదని స్పీకర్ వివరణ ఇచ్చారు. ఒకవేళ తన వ్యాఖ్యలు సునీతను బాధించి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీంతో వివాదానికి తెర పడింది.