05-04-2025 02:25:20 AM
శిష్యుడు తనను మించిపోతే ఏ గురువైనా పొంగిపోతాడు. ఐతే, ఆ ఎదుగుదల ఎందులో ఉండాలి? విద్య లేదా జ్ఞానంలో! నిజానికి చాలామంది గురుదక్షిణను సైతం ఆశించక తమకు నచ్చిన శిష్యులకు ఏదీ దాచుకోక సర్వస్వం ధారపోస్తారు. ఫలితంగా, శిష్యులు అటువంటి గురువులకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేరు. మనం ఎంత మంచి శిష్యులమన్నది మన గురువులు ప్రకటించాలి. అదృష్టవశాత్తు నాకు గొప్ప గురువులు లభించారు. ఇదే పద్ధతిలో నావంటి శిష్యు లూ నాకు లభించాలని కోరుకుంటాను. నిజానికి అలాంటి శిష్యులే చాలామంది. కానీ, అందరూ ఒక్కలా ఉండరుగా. దురదృష్టవశాత్తు నేను బాగా వాత్సల్య వర్షాన్ని కురిపించిన ఒకానొక శిష్యపుంగవుడు చివరకు నాకే ‘శఠగోపం’ పెట్టాడు.
-ఆచార్య మసన చెన్నప్ప
“నాకు భగవద్గీత కంఠస్థం సార్! కాని, దాన్ని ఎట్లా వివరించి చెప్పాలో తెలియడం లేదు. ఆన్‌లైన్ జూమ్‌లో మీరు గీతమీద ప్రసంగిస్తుంటే విన్నాను. పరోక్షంగా మీకు ఏకలవ్య శిష్యుణ్ణయ్నాను. ఇప్పుడు నాకు ఆ మహోన్నత భగవద్ సందేశం గురించి ఎంతసేపైనా మాట్లాడాలనిపిస్తుంది..” అన్నాడు అతను నాకు పరిచయం అవుతూనే.
ఈ మాటలకు నేను పొంగి పోయాను. నా ద్వారా అతడు గీతను వ్యాఖ్యానించే స్థాయికి వచ్చాడంటే ప్రశంసింపదగిన విషయమే కదా. అతనితో పరిచయం రాన్రా ను పెరిగింది. మా గురుశిష్య ‘బంధం’ ఎంత దూరం వచ్చిందంటే, ‘నేనెక్కడ ఉపన్యసించేది ఉన్నా అతణ్ణి కూడా తీసుకెళ్లా ను.’ వెళ్లిన చోట్ల నాతోసహా అతనికీ సన్మా నం జరిగేది. ఇన్నాళ్లకు ఒక్కడైనా నా మా ర్గంలో నడుస్తున్నందుకు తృప్తి చెందాను.
నిజానికి భగవద్గీత మీద మాట్లాడడం అంత సులభం కాదు. చాలా మంది ఏవేవో కొన్ని శ్లోకాలు చదువు తూ వాటి అర్థాన్ని వివరిస్తారు. భగవద్గీత ధర్మగ్రంథమే కాదు, యోగశాస్త్రం కూడా. శ్రీకృష్ణుడు ఉపనిషత్తులను గోవులుగా చేసుకుని గీత అనే జ్ఞానామృతాన్ని లోకానికి అందించాడు. దానిని మొదట పార్థుడు గ్రోలాడు. ‘కఠోపనిషత్తు’లో యామాచార్యుని ద్వారా నచికేతుడు ఆత్మవిద్యను ఆవిష్కరిస్తాడు. అట్లే, భగవద్గీతలో శ్రీకృష్ణుని ద్వారా అర్జునుడు యోగవిద్యను ఆవిష్కరిస్తాడు. ఆత్మానాత్మల వివేకం కలగాలంటే దర్శన గ్రంథాల ఆధారంగా భగవద్గీతను ప్రబోధించాలి. ఈ క్రమంలో పతంజలి యోగ దర్శనాల్ని అవలోకనం చేయకుండా గీతాసారాన్ని, పరమార్థాన్ని తెలియజేయడం కష్టం.
భగవద్గీతపై ప్రసంగించేవారు వివేక వైరాగ్యాలకు అది ఏ విధంగా తోడ్పతుందో చెప్పలేరు. “నిస్రై గుణ్యో భవార్జున” అన్నమాట ఎందరికి అర్థమవుతుంది? ప్రకృతి త్రిగుణాత్మకమైంది. సత్యం, రజస్సు, తమస్సు త్రిగుణాలు. ఈ ప్రాకృతిక గుణాలకు అతీతంగా ఉన్నవాడు పరమాత్మ. అతణ్ణి సాక్షాత్కరించుకోవాలంటే యోగసాధన తప్పనిసరి. త్రిగుణాత్మకమైన ప్రపంచ బంధనాల నుంచి మనం బయటపడాలి. ఇలాంటి సూక్ష్మవిషయాలు చాలా ఉంటాయి. గీతను ప్రబోధించే వారికి మొదట శ్రీకృష్ణుడు అర్థం కావాలి. భగవంతుణ్ణి అర్థం చేసుకోకుండా ఆయన సందేశాన్ని బోధ పరచుకోలేరు. అందుకోసం తొలుత ఉపనిషత్తులను అవగాహన పరచుకోవాలి.
క్రమక్రమంగా అతను నాకు మరింత దగ్గరయ్యాడు. నేనూ బాగా అభిమానించాను. తనను నాకు తెలిసిన వారికందరికీ పరిచయం చేశాను. ఉపనిషత్ సప్తాహాలకు తననూ తీసుకెళ్లాను. అనేకానేక ధర్మసూక్ష్మాలను వేదానుగుణంగా, దర్శనాల ప్రకారంగా పరిచయం చేశాను. నా పుస్తకాలన్నీ ఇచ్చాను. అతడు క్రమంగా నాకు ప్రియశిష్యుడు అయ్యాడు.
నేను 40 ఏళ్లు అధ్యాపక వృత్తిలో ఉన్నాను. నాకు సాహిత్య సంబంధమైన శిష్యగణం వేలసంఖ్యను మించుతుంది. కానీ, ఆధ్యాత్మికంగా నాకు ఇలా శిష్యుడు లభించడం అదృష్టంగా భావించాను. అతడు నన్ను అనుసరిస్తూ అందరితోనూ ప్రశంసలు పొందుతుంటే, ఒక మిత్రునివలె ఆనందించాను.
ఎలాగైతే, పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులకు మిత్రులుగా మారతారో అలా! ఆయా సభలు, సమావేశాల్లో తనను అభినందిస్తూ, ప్రశంసించాను.
గురువుకే శఠగోపం
“శిష్యాదిచ్ఛేత్ పరాజయం” (గురువు శిష్యుల నుంచి పరాజయాన్ని కోరుకుంటాడు). ఇదే పద్ధతిలో “పుత్రాదిచ్ఛేత్ పరాజయం” అనే వారుంటారు. కాని, ఏ తండ్రీ తన కుమారుని నుంచి అపజయాన్ని కోరుకోడు. గురువు మాత్రం కోరుకుంటాడు కాబట్టే, గురువును ‘తండ్రికంటే గొప్పవాడు’ అన్నారు. ఎప్పుడైతే అందరికీ పరిచయమై గీతా ప్రబోధకునిగా చెలామణి అవుతున్నాడో అతనికి కొద్దికొద్దిగా గర్వం పెరుగసాగింది. ‘గీతాజ్ఞానం బోధించాలంటే తనకున్న సామర్థ్యం ఎవరికీ లేదని, తనంత మెరుగ్గా మరెవరూ చెప్పలేరని’ ఏకంగా సభలు, సమావేశాల్లోనే చెప్పుకోసాగాడు. తాను సాక్షాత్ శ్రీకృష్ణుణ్ణే అన్నంత స్థాయిలో ‘ఎదిగి’పోయాడు.
“అహంకారం వద్దు/ ఓంకారమే ముద్దు” అన్నది నా సిద్ధాంతం. శిష్యస్థానం నుంచి మిత్రస్థానానికి ఎదగడం అభినందింప విషయమే గాని, అసహనానికి గురయ్యే విషయం కాదు. అన్నింటి కంటే మిత్రధర్మం గొప్పది. అపకారికి ఉపకారం చేసేవాడే మిత్రుడు. కాని, ఉపకారికి అపకారం చేసేవాడు మిత్రుడు కాజాలడు.
ఒకరోజు ఓ చిత్రమైన సంఘటన జరిగింది. అతడూ, నేను ఇద్దరం కారులో ప్రయాణిస్తున్నాం. ఉన్నట్లుండి అతడు అన్నాడిలా
“సార్! మీకు నేను గురువును కాదలిచాను..”
ఒక్క క్షణం నివ్వెరపోయాను. తత్తం అర్థం చేసుకున్నాను కనుక వెంటనే అడిగాను “ఆ అవసరం ఇప్పుడెందుకు?”
“అదేంటి సార్, నేను కృష్ణుణ్ణి కదా. మీకు తెలియని గీతా రహస్యాలను ప్రత్యేకంగా చెప్తాను..”
“అలాగే..” అన్నాను.
ఆ తర్వాత అతడు నాకు కనిపించలేదు. నేనూ ఇక, అతనికోసం వెతకలేదు.
వ్యాసకర్త సెల్: 9885654381