ఆచార్య మసన చెన్నప్ప :
గురువుకు నచ్చిన శిష్యుడు, శిష్యునికి తగిన గురువు కలవడం చాలా అరుదు. ఇలాంటి వాళ్ళదే నిజమైన గురుశిష్య బంధం. నా పట్ల అనిర్వచనీయమైన వాత్సల్యాన్ని కురిపించిన అటువంటి గురువు, మహా పండితుడు అమరేశం రాజేశ్వర శర్మ. వృద్ధాప్యంలో అనుకో కుండా వారు ఇటీవలే కాలధర్మం చెందారు. వారి స్మృతికి నివాళిగా వందలాది మంది శిష్యుల్లో ఒకరిగా, నా ఈ అనుభవాన్ని అందిస్తున్నాను.
నేను 1978లో ఎం.ఏ. (తెలుగు) ప్రవేశ పరీక్షలో ర్యాంకు తెచ్చుకొని, బషీర్‌బాగ్‌లోని పీజీ కళాశాలలో చేరాను. భాగ్యవశాత్తు ఉద్ధండులైన ప్రొఫెసర్లు పాఠాలు బోధించారు. వారిలో ఒకరు ఆచార్య అమరేశం రాజేశ్వరశర్మ. వీరు వ్యాకరణం చెప్పేవారు. ‘తెలుగు వ్యాకరణ వికాసం’పై పరిశోధన చేసిన రాజేశ్వరశర్మ పాఠం చెబుతుంటే మాకు ఆనందంగా ఉండేది.
నేను ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’లో ప్రాచ్యవిద్యను అభ్యసించిన వాణ్ణి. సుమారు 8 ఏళ్లు వ్యాకరణం చదువుకున్నాను. మరో రెండేళ్లు వ్యాకరణం వినే అదృష్టం కలిగింది రాజేశ్వరశర్మ వల్లే. పాఠం చెప్పి, అమరేశం వారు కేవలం పుస్తకంలోని ఉదాహరణలే కాక లోకంలోని ఎన్నో విషయాలను సమన్వయం చేసి చెప్పేవారు.
ఒకసారి క్లాసులో ‘మహేశ్వర సూత్రాల’ ప్రసక్తి వచ్చింది. వారు ఒక్కొక్క దాన్ని వివరించి చెబుతున్నారు. నాకు ప్రశ్నలు వేసే స్వభావం బాల్యం నుంచే ఉంది. “శివుడు డమరుకం వాయిస్తుండగా వర్ణాలు ఉద్భవించాయి” అని ఆచార్యుల వారు చెప్పారు. “శివుడే వ్యాకరణానికి ప్రయోక్త.
అక్షరుడైన పరమేశ్వరుని నుంచే అక్షరాలు వచ్చా యి” అని ఆయన వేదాంతాన్నికూడా జోడించి చెప్పారు. ‘అన్ని అక్షరాలకు మూలం ఓం కారమని, పరమేశ్వరుడు ఓం కార స్వరూపుడని’ వారు వివరించారు. అప్పుడు నేనడిగాను
“పరమేశ్వరుడు ఓం కార వాచ్యుడు కదా! ఆయనకు ఓం కారమనే పేరు ఎవరు పెట్టారు?”
“పరమేశ్వరునికి ఓం అనే పేరు వేదంలో కనిపిస్తుంది. వేదమాత వల్లనే ఆయనకు ఆ పేరు స్థిరమైంది” అన్నారాయన. నేను అక్కడితో ఊరు కోకుండాె “ఓం అనే పేరు పెట్టాలని వేదమాతకు ఎందు కు అనిపించింది?” అన్నాను. అప్పుడు వారు ఏ మాత్రం విసుక్కోలేదు. నన్ను నిందించనూ లేదు. ఆ ప్రశ్న అడిగినందుకు నింపాదిగా, “అడిగేవారికి చెప్పేవాడు లోకువ” అని ఊరుకున్నారు. దాంతో నా ప్రశ్నలు ఆగిపోయాయి.
లోక స్వభావాన్ని రంగరించి చెప్పడం అమరేశం వారి ప్రజ్ఞ. క్లాసులో వారు వినిపించిన ఆ చివరి మాట ఒక సందర్భంలో మాకు బాగా ఉపయోగపడింది. దానివల్ల మా క్లాసులోని 30 మంది విద్యార్థులం ఒక విధంగా ప్రయోజనం పొందాం. మాకు అప్పటికే సెమిస్టర్ పద్ధతి వచ్చింది. సంవత్సరంలో రెండు సెమిస్టర్లు. ప్రతి సెమిస్టర్ నాలుగు అంశాలమీద ఉండేది. పరీక్ష విషయానికి వస్తే ప్రతి సబ్జెక్టుకు 50 మార్కులు.
35 మార్కులు విశ్వవిద్యాలయ ప్రశ్నాపత్రానికి, 10 మార్కులు కళాశాలలో తయారు చేసిచ్చే ప్రశ్నాపత్రానికి, 5 మార్కులు వైవాకు, మొత్తం 50 మార్కులు ఉండేవి. నాలుగు సబ్జెక్టులకు కలిపి మొత్తం 200. రెండు సెమిస్టర్లకు 400.
రెండేండ్లకు 800 మార్కులు. అన్ని సెమిస్టర్లలో అధిక మార్కులు తెచ్చుకున్న వారికే ఫస్టు ర్యాంకు లభించేది. విద్యార్థులకు కేవలం పాఠాలు వినడం, పరీక్షలు రాయడంతోపాటు పరీక్షా విధానమూ తెలిసి ఉండాలి. అప్పుడే తెలివిగా పరీక్షలు రాసి అనుకున్న ఫలితం సాధించవచ్చు.
అడిగేవారికి చెప్పేవారు లోకువ!
ఆ రోజు వ్యాకరణం పేపరుకు సంబంధించి ‘వైవా పరీక్ష’ జరుగుతున్నది. వైవాలో ఆచార్యులు మమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతారు. మేం ఐదింటికి సమాధానాలు చెబితే 5 మార్కులు పూర్తిగా వస్తాయి. లేకపోతే, గుండు సున్నా. అమరేశం రాజేశ్వరశర్మ వైవా తీసుకుంటున్నారు. నాకంటే ముందు మా మిత్రులు వైవాకు హాజరై బయటికి వచ్చారు. వారి ముఖంలోని విషాదరేఖను కనిపెట్టాను.
నా వంతు రాగానే వైవాకు హాజరయ్యాను. అమరేశం వారు నన్నేవో ప్రశ్నలు అడిగారు. ఐదింటిలో ఒక్క ప్రశ్నకు నేనుకూడా తబ్బిబ్బయ్యాను. “చెప్పండి సమాధానం?” అన్నారు వారు. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, ఒకనాటి క్లాసులో వారు చెప్పిన మాట. వెంటనే నిర్భయంగా, “అడిగేవారికి చెప్పేవారు లోకువ” అన్నాను. “నా మాటే నాకు అప్పజెప్పుతున్నావా చెన్నప్పా?” అని ఆయన నవ్వి ఊరుకున్నారు.
బయటికి వచ్చిన తర్వాత, ‘వారికేమైనా కోపం వచ్చిందా?’ అన్న అనుమానం నాకు కలిగింది. కానీ, వారు నా మాటలను సీరియస్‌గా తీసుకోలేదు. ఆ సెమిస్టర్ వైవాకు సంబంధించి ఎవరికీ నిరాశ కలగకుండా మార్కులు వచ్చాయి. ఈ సంఘటనను ఉదాహరించడానికి కారణం, ఆచార్య అమరేశం వారు ఎంతటి సౌజన్యమూర్తులో చెప్పడానికే! నిజంగా వారు శిష్య వత్సలు రు.
వ్యాకరణం కఠినమే కాని, అది చెప్పే ఆయన హృదయం అత్యంత సుకుమారం. వారు ఆర్ట్స్ కళాశాలలో తెలుగు విభాగానికి అధ్యక్షులుగా ఉన్నప్పుడే మాకు విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకులుగా చేరడానికి ఇంటర్వ్యూలు జరిగాయి. ఆయన సీట్లో కూర్చొని ఉండగా, “అప్లికేషన్‌లో రెఫరెన్స్ దగ్గర మీ పేరు రాస్తున్నాను సార్..” అన్నాను. “నీకు శుభం కలుగు గాక!” అని ఆశీర్వదించారు. ఆయన ఆశీస్సులు ఫలించాయి.
వ్యాసకర్త సెల్:9885654381