calender_icon.png 6 November, 2024 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నింటిలోనూ నిరాశే..

08-08-2024 02:06:41 AM

టీటీ క్వార్టర్స్‌లో భారత జట్టు ఓటమి

హైజంప్, రెజ్లింగ్, జావెలిన్ త్రోలో ఓటములు

రెపిచేజ్‌కు అథ్లెట్ జ్యోతి

పారిస్: విశ్వక్రీడల్లో భారత అథ్లెట్లకు బుధవారం ఏదీ కలిసిరాలేదు. పోటీ పడిన ప్రతీ ఈవెంట్‌లోనూ మన ఆటగాళ్లకు ఓటములే ఎదురయ్యాయి. టేబుల్ టెన్నిస్‌లో మహిళల జట్టు క్వార్టర్స్‌కే పరిమితమవ్వగా.. మారథాన్ రేస్ వాక్, పురుషుల హైజంప్, మహిళల జావెలిన్ త్రో, రెజ్లింగ్‌లోనూ నిరాశే మిగిలింది. 100 మీటర్ల హార్డిల్స్‌లో తెలుగు అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయింది. అయితే రెపిచేజ్ ద్వారా జ్యోతికి మరో అవకాశముంది.

క్వార్టర్స్‌లో భారత్ ఓటమి..

టేబుల్ టెన్నిస్ టీం ఈవెంట్‌లో భారత మహిళల జట్టు క్వార్టర్స్‌కు పరిమితమైంది. క్వార్టర్స్‌లో మనికా బాత్రా, ఆకుల శ్రీజ, అర్చనలతో కూడిన జట్టు 1-3 తేడాతో జర్మనీ చేతిలో పరాజయం చవిచూసింది. ఇక మహిళల రెజ్లింగ్‌లో అంతిమ్ పంగల్ నిరాశపర్చింది. మహిళల 53 కేజీల ప్రిక్వార్టర్స్‌లో అంతిమ్ 0 తేడాతో తుర్కియేకు చెందిన యెట్గిల్ చేతిలో పరాజయం చవిచూసింది. ఇక మహిళల జావెలిన్ త్రోలో అన్నూరాణి నిరాశపరిచింది. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే జావెలిన్‌ను 62 మీటర్లు విసరాల్సి ఉండగా.. అన్నూ 55.91 మీటర్లకే పరిమితమైంది.

పురుషుల ట్రిపుల్ హై జంప్ క్వాలిఫికేషన్‌లో సర్వేశ్ అనిల్ (2.15 మీటర్లు) నిరాశపరిచాడు. 100 మీటర్ల హార్డిల్స్‌లో హీట్ 4లో పోటీ పడిన యర్రాజీ జ్యోతి గమ్యా న్ని 13.16 సెకన్లలో పూర్తి చేసింది. ఫైనల్ చేరడంలో విఫలమైన జ్యోతీ నేడు రెపిచేజ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక గోల్ఫ్‌లో తొలి రౌండ్ ముగిసేసరికి భారత మహిళా గోల్ఫ్ ప్లేయర్లు దీక్షా డాగర్ టీ7లో నిలవగా.. అదితి అశోక్  టీ13వ స్థానంలో నిలిచింది. నేడు మహిళల గోల్ఫ్ రెండో స్ట్రోక్ ప్లే జరగనుంది.