దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి అవసరమైన సంస్కరణ వాద విధానాలు నిర్మలమ్మ బడ్జెట్‌లో లేవు. కేంద్ర బడ్జెట్ ఇప్పటికీ పాత పద్ధతినే అనుసరిస్తున్నది. ఇక్కడ కొద్దిమంది ధనవంతులు, సంపన్నులు మినహా దేశంలోని పేదలు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, కార్మికులు, అట్టడుగున నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాల ఆకాంక్షలు, అభ్యున్నతికి చోటు దొరకలేదు.
కేంద్ర బడ్జెట్ అనేది కేవలం ఆదాయ వ్యయాల ప్రకటన మాత్రమే కాదు, ప్రస్తుత ప్రభుత్వ విధాన పత్రంగా కూడా పని చేస్తుంది. ఇది అధికారంలో ఉన్నవారి ప్రాధాన్యత, వ్యూహాలు, కట్టుబాట్లను ప్రతిబింబిస్తుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దురదృష్టవశాత్తు ఆదాయ అసమానతలు వంటి కీలక సమస్యలు పరిష్కరించడంలో ఈ బడ్జెట్ విఫలమైంది. సామాన్యులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన ఆందోళనల గురించి ప్రస్తావించా ల్సిన అవసరం లేదని భావించిన ఈ బడ్జెట్‌ను విమర్శకులు ‘అండర్ హెల్పింగ్ బడ్జె ట్’గా పేర్కొన్నారు.
బడ్జెట్‌లో ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (ఎన్‌ఆర్‌ఈజీఏ) వంటి కీలకమైన అంశాలను పట్టించుకోలేదు. సాధారణ పౌరుల ఆదాయాన్ని మెరుగు పరచడానికి తగిన చర్యలు తీసుకోలేదు. ఏంజెల్ ఇన్వెస్టర్లకు పన్నును రద్దు చేయడం మాత్రమే గుర్తించదగిన నిబంధనగా కనిపించింది. ఇది విస్తృత ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి పెద్దగా ఉపకరించదు. బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్లు స్పందించిన తీరే అది ఎలా ఉందనే దానికి అద్దం పడుతున్నది.
ప్రధాన సమస్యలకు పరిష్కారాలు ఏవి?
ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు ఆందోళన కర స్థాయికి చేరుకున్నాయి. సామాన్య ప్రజలు, రైతులు, పేదలు, కూలీలు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలు ఈ బడ్జెట్ తమకు కొంత ఊరటనిస్తుందని, భరోసా ఇస్తుందని ఆశించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుందని, ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని, ప్రజ ల ఆర్థిక స్థిరత్వానికి ప్రత్యక్ష మద్దతును ఇస్తుందని వారు ఆశించారు. కానీ, ఈ బడ్జెట్ సామాన్య ప్రజల ఆశలు, అంచనాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఖజానా ఖాళీగా, అడ్రస్ లేకుండా పోయింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ సమర్పణకు చాలామంది నిస్సహాయ దిశా నిర్దేశం చేశారు. ఈనాటి ఒత్తి డి, సమస్యలకు నిజమైన పరిష్కారం అం దించలేదు. ద్రవ్యోల్బ ణం, నిరుద్యోగం ఆర్థిక అసమానతలను పరిష్కరించడానికి ఖచ్చితమైన చర్యలు లేకపోవడం తీవ్ర నిరాశ పరిచింది.
ప్రభుత్వ విధానం దాని పౌరుల పోరాటాల నుండి డిస్‌కనెక్ట్ అయినట్లు ప్రస్తుత పరిస్థితి కనిపిస్తున్నది. చాలామంది ఆశగా ఎదురుచూస్తున్న మద్దతు, హామీని అం దించడంలో బడ్జెట్ విఫలమైంది. కేవలం తన ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న బీహార్, ఆంధ్రప్రదేశ్‌లకు వరాలు కురిపించి మిగతా రాష్ట్రాలకు పేలవమైన కేటా యింపులు ఇచ్చింది. ‘కుర్సీ బచావో’ (సీటును కాపాడుకునే) బడ్జెట్‌గా మాత్రమే ఉంది. క్లిష్టమైన సమస్యలను, ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. మహిళలకు సంబంధించిన ప్రధాన ఆం దోళన వారి భద్రత. ఈ సమస్యా పరిష్కారం కాలేదు. ద్రవ్యోల్బణం నియంత్ర ణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకున్నట్లు కనిపించలేదు.
గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి నిరంతరం తగ్గుతున్నది. బడ్జెట్‌లోని కీలక అంశాలను 2024 లోక్‌సభ ఎన్నికల నాటి కాంగ్రెస్ మేనిఫెస్టో నుండి ఆర్థికమంత్రి కాపీ చేసినట్లుగా కనిపిస్తున్నదంటూ ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆర్థికమంత్రి లోక్‌సభలో చదివారని వారు ఎద్దేవా చేశా రు. ఆమె కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని 30వ పేజీలో వివరించిన ‘ఉపాధి- అనుసంధాన ప్రోత్సాహకాన్ని’ వాస్తవంగా స్వీకరించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని 11వ పేజీలో పేర్కొన్న ‘ప్రతి అప్రెంటిస్‌కు భత్యంతోపాటు అప్రెంటిస్‌షిప్ పథకాన్ని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌లో ప్రకటించడం గమనార్హం. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని కొన్ని ఇతర ఆలోచనలను కూడా ఆర్థికమంత్రి కాపీ చేశారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
వారికి ప్రత్యేక ప్యాకేజీలు సరే..
మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక కేటగిరీ’ హోదాను నిరాకరించింది. అయితే, బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏలో భాగమైన ఆంధ్రప్రదేశ్‌లోని అధికార టీడీ పీ, బీహార్‌లోని జేడీ(యు)లను సంతృప్తి పరిచేందుకు బడ్జెట్‌లో ప్రకటించిన ప్యాకేజీలు ప్రత్యేకంగా అందరి దృష్టినీ ఆకర్షిం చాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎదగడంలో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో విస్మరించడంపై వివిధవర్గాల నుండి ప్రతిస్పందనలు ఎదురయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఎంపీ, కేరళ రాష్ట్రాల అభివృద్ధిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మరించి, ఆయా రాష్ట్రాల యు వత, రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు అభిప్రాయం ఏర్పడిం ది.
మోదీ ప్రభుత్వ 11వ బడ్జెట్‌లో నిరుద్యో గం, ధరల పెరుగుదల, రైతులు, మహిళలు, యువత తప్పిపోవడం వంటి ప్రధా న సమస్యలకు ఎలాంటి పరిష్కారాలను చూపలేదు. ‘ఇది నిస్సహాయతల మూట. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు జీవించి ఉన్నందుకు దేవునికి ధన్యవాదాలు’ వంటి వ్యాఖ్యలు వినిపించాయి. దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి అవసరమైన సంస్కరణ వాద విధానాలు నిర్మలమ్మ బడ్జెట్‌లో లేవు. కేంద్ర బడ్జెట్ ఇప్పటికీ పాత పద్ధతినే అనుసరిస్తున్నది. ఇక్కడ కొద్దిమంది ధనవంతులు, సంపన్ను లు మినహా దేశంలోని పేదలు, నిరుద్యోగు లు, రైతులు, మహిళలు, కార్మికులు, అట్టడుగున నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాల ఆకాంక్షలు, అభ్యున్నతికి చోటు దొరకలేదు.
125 కోట్లకు పైగా అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారికి మౌలిక వసతుల కల్పనకు అవసరమైన సంస్కరణ విధానాలు, ఉద్దేశాలు కూడా ఈ కొత్త ప్రభుత్వానికి ఉన్నట్టు లేవు. ఎలాంటి దిశా, దశ లేని బడ్జెట్‌లో ఇలాంటి కేటాయింపులతో ప్రజ ల జీవితాలు సంతోషంగా, సుభిక్షంగా మా రతాయని అనుకోవడం శుద్ధ అవివేకం. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఆదాయ అసమానతలు వంటి ముఖ్యమైన సమస్య లను పరిష్కరించడంలో కేంద్ర బడ్జెట్ పూర్తిగా విఫలమైంది. అరువు తెచ్చుకున్న ఆలోచనలపై ఆధార పడటం, కేవలం కొన్ని రాష్ట్రాలపై దృష్టి సారించడం, ఇతరులను నిర్లక్ష్యం చేయడం వంటివి సమా జంలోని వివిధ రంగాలలోని అసంతృప్తిని మరింత నొక్కి చెబుతున్నాయి.
పోరుబాట తప్పదా?
కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆగ్రహం అప్పుడే పెల్లుబుకుతున్నది. ఢిల్లీలో పార్లమెంటు ముందు విపక్ష ఇండియా కూటమి నేతలు బడ్జెట్‌లో విపక్ష పాలిత రాష్ట్రాలపట్ల బడ్జెట్ సవతి తల్లి ప్రేమపై నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. తెలంగాణకు బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై రాష్ట్ర అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌సహా అన్ని పక్షాల సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన గళం వినిపించారు. విభజన చట్టంలోని హామీలను సైతం విస్మరించిన కేంద్రం వైఖరికి నిరసనగా అసెంబ్లీలో తీర్మా నం చేయడానికి సిద్ధమయ్యారు.
ఇక, మోడీ సర్కార్‌పై కారాలు మిరియాలు నూరుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వంటి నేతలు తమ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటన్నది ఇంకా వెల్లడించక పోయినప్పటికీ వారు సైతం కేంద్రం వివక్షపై పోరుబాట పడతారనడంలో ఎలాంటి సం దేహం లేదు. మొత్తం మీద ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాదే బడ్జెట్ రూపంలో విపక్షాలకు ఓ బలమైన ఆయుధాన్ని అందించిందనడంలో ఎలాం టి సందేహం లేదు.
- డా. యం. సురేష్ బాబు
వ్యాసకర్త అధ్యక్షుడు, ప్రజాసైన్స్ వేదిక