calender_icon.png 5 November, 2024 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనుమరుగవుతున్న చెరువులు

05-11-2024 12:19:47 AM

  1. బతుకమ్మ కుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో బడా భవనాలు
  2. రంగప్ప చెరువును మింగేస్తున్న నిర్మాణాలు
  3. జనగామాలో అక్రమ నిర్మాణాలపై పట్టింపు లేని యంత్రాంగం

జనగామ, నవంబర్ 4 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలోని చెరువులు, కుంటలను అక్రమార్కులు మింగేస్తున్నారు. ప్రకృతి వనరులను కనుమరుగు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకృతి విపత్తులను లెక్క చేయకుండా చెరువులు, కుంటల పరిధిలో అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నా రు. అయినా కూడా అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. 

ఆక్రమణకు గురైన రంగప్ప చెరువు

జనగామ పట్టణంలోని రంగప్ప చెరువు ఆక్రమణకు గురవుతోంది. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో సుమారు 40 ఎకరాల భూమి ఉంది. ఇందులో వందలాది భవనాలు వెలిశాయి. ఎఫ్‌టీఎల్ పరిధిలోని 463 సర్వే నంబర్‌ను ఏకంగా రికార్డుల నుంచి మాయం చేసి మరీ కబ్జాల పర్వం సాగించినట్లు ఆరోపణలున్నాయి.

పట్టణంలోని జిల్లా ఆస్పత్రి, జిల్లా కోర్టు, జడ్పీ చైర్‌పర్సన్ కార్యాలయం, ఇరిగేషన్ కార్యాలయంతో పాటు ప్రధాన ఆఫీసులకు దగ్గరి వరకు రంగప్ప ఎఫ్‌టీఎల్ పరిధి ఉండటంతో ఇక్కడ స్థలాలకు బాగా డిమాండ్ ఉంది. దీంతో రియల్టర్లు వెంచర్లు, ప్లాట్లు చేసి విక్రయాలు జరిపారు. మునిసిపల్ శాఖ నుంచి ఇంటి నిర్మాణాలకు అనుమతులు రావడం గమనార్హం.

2020లో గోదావరి జలాలకు తోడు భారీ వర్షాలు కురవడంతో రంగప్ప చెరువులోకి వరద నీరు వచ్చింది. దీంతో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న వందలాది ఇండ్లలోకి నీరు చేరింది. అప్పటి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇండ్లు నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు నోటీసులు ఇచ్చి ఇండ్లు ఖాళీ చేయాలని ఆదేశించారు. కొద్ది రోజులకే ఆయన బదిలీ కావడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

బతుకమ్మ కుంటలో బడా భవనాలు

జనగామ పట్టణంలోని ప్రధానమైన ప్రాంతాల్లో బతుకమ్మ కుంట ఒకటి. చెరువుల సుందరీకరణలో భాగంగా గత ప్రభుత్వంలో ఈ చెరువును అందంగా తీర్చిదిద్దారు. సుందరీకరణ చాటున ఈ చెరువు స్థలాన్ని భారీగా కుదించినట్లు ఆరోపణలు వచ్చాయి. బీఆర్‌ఎస్ హ యాంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇదంతా జరిగింది.

సుందరీకరణ సమయంలో చెరువు పక్కనే రెండెకరాల స్థలాన్ని ఆయన కబ్జా చేసి వెంచర్ చేసినట్లు అప్ప టి కలెక్టర్ దేవసేనా బహిరంగ విమర్శలు చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకే ఆమెను ఇక్కడి నుంచి బదిలీ చేశారు. మరోవైపు బతుకమ్మ ఎఫ్‌టీఎల్ పరిధిలో వందలాది భారీ భవంతులు నిర్మించారు.

కలెక్టరేట్‌కు దగ్గరలో, రెండు జాతీయ రహదారులకు మధ్యలో ఉండటంతో ఈ ప్రాంతానికి చాలా డిమాండ్ ఉంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ను అక్రమార్కులు ఎక్కడికక్కడ కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయాలు చేపట్టారు. మునిసిపల్ శాఖ అండదండలతో పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి. వినయ్‌కృష్ణారెడ్డి కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో వెలసిన నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశా రు.

జేసీబీతో పలు ఇండ్లను స్వల్పంగా ధ్వంసం చేయించారు. అక్రమ నిర్మాణాలను యజమానులే కూల్చుకోవాలని కొంత గడువు ఇచ్చారు. ఆ తరువాత కొన్ని రోజులకే కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి బదిలీ కావడంతో ధ్వంసమైన ఇండ్లను మళ్లీ నిర్మించుకోవడమే కాకుండా..

మరిన్ని భవనాలను యథేచ్ఛగా నిర్మించారు. ఇక్కడ గజం రూ.30 వేలకు పైనే పలుకుతుండటంతో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. గతంలో 15 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న చెరువు.. ఇప్పుడు 9 ఎకరాలకే పరిమితమైంది.