calender_icon.png 25 October, 2024 | 2:51 AM

కనుమరుగైన కుంట

25-10-2024 12:00:00 AM

  1. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణల పర్వం 
  2. పట్టించుకోని అధికారులు

అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 24: నగర శివారు ప్రాంతమైన పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో చెరువులు, కాల్వలు, కుంటలు అన్యాక్రాంతమవుతున్నాయి. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.

హైదరాబాద్ రహదారికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో చెరువులు, కాల్వలు, కుంటాలు కబ్జాలకు గురవుతున్నాయి. కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

ఆనవాళ్లు లేని అవసలోని కుంట 

హైదరాబాద్ రహదారికి ఆనుకొని సర్వే నెంబర్ 605లో అవసలోని కుంట దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని, ప్రస్తుతం ఆ కుంట ఆనవాళ్లు లేకుండా చేశారని స్థానికులు చెబుతున్నారు. కొందరు అక్రమార్కులు కుంటను దర్జాగా కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి వాటిని ఇతరులకు అమ్మేశారు.  

సగమైన దర్పల్లివారి కుంట 

పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో ఉన్న దర్పల్లివారి కుంట సగానికి పైగా కబ్జాకు గురైందని స్థానికులు తెలిపారు. ఆ కుంట ఆయకట్టు కింద దాదాపు 30 ఎకరాలు భూములు ఉన్నాయని, అలాంటి కుంటను ఇప్పుడు సగానికిపైగా ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంట ఎఫ్‌టీఎల్ ఏరియాలో ఓ బడా రియల్ ఎస్టేట్ కంపెనీ అద్దాల మేడలను నిర్మించింది. ఆ నిర్మాణాలకు అధికారులు పర్మిషన్లు ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 

నామరూపం లేని వెంకటయకుంట

పసుమాముల గ్రామ సర్వే నంబర్ 64లో ఉన్నటువంటి వెంకటయ కుంట ప్రస్తుతం కనుమరుగై పోయింది. కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో భవనాలు వెలిశాయని స్థానికులు తెలిపారు.  

చర్యలు తీసుకుంటాం

పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అవసలోని కుంట, దర్పల్లివారి కుంట, వెంకటయ కుంటలను వెళ్లి పరిశీలిస్తాం. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలో నిర్మాణాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం.      

 వంశీ, ఇరిగేషన్ ఏఈ, 

అబ్దుల్లాపూర్‌మెట్