- యంత్రాలతోనే వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు
- సమయం ఆదా
- తగ్గిన శ్రమ
కొడంగల్, జూలై 17: కొన్నేళ్ల క్రితం వరకు దుక్కి దున్నాలన్నా, విత్తు విత్తాలన్నా, పండించిన పంటలు ఇంటికి చేర్చాలన్నా కాడెద్దులు, ఎద్దుల బండ్లే దిక్కు. వ్యవసాయ పనుల్లో కాడెద్దుల పాత్ర కీలకంగా ఉండేది. ప్రస్తుతం ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు అందుబాటులోకి రావడంతో కాడెద్దుల అవసరం లేకుం డా పోయింది. నాడు ఎద్దులతో ఒకరోజులో అయ్యే పనిని, యంత్రాలతో గంట సమయంలోనే పూర్తి అవడంతోపాటు ఖర్చు, శ్రమ తగ్గుతుండడంతో వ్యవసాయ పనుల్లో కాడెద్దులు కనుమరుగవుతున్నాయి. అన్నదాతలకు వెన్నదన్నుగా నిలిచిన ఎడ్లు, ఎండ్ల బండ్లు నేడు ఉనికిని కోల్పోతున్నాయి. యంత్రాల రాకతో రాబోయే రోజుల్లో కాడెద్దుల ఎవుసం పూర్తిగా అంతరించిపోయే అవకాశమూ లేకపోలేదు.
ఆధునిక యంత్రాలతో పనులు
ప్రస్తుతం మార్కెట్‌లో ఆధునిక యంత్రా లు విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి. నాగళ్లు, కల్టీవేటర్, గొర్రు, గుంటుక, లెవలింగ్, హర్వెస్టర్ వంటి ఎన్నో యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరికాలను ట్రాక్టర్లకు బిగించి వ్యవసాయ పనులు చేస్తున్నారు. కాడెద్దుల నాగళ్లతో దుక్కులు దున్నే వారు కరువయ్యారు. గతంలో వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతులు తమ ఎద్దులను, బండ్లను సిద్ధం చేసుకునేవారు. సొంత ఎద్దులు, ఎడ్లబండి ఉన్నోళ్లకు మంచి గిరాకీ ఉండేది. రైతు కూలీలకు కూడా చేతి నిండా పనులు దొరికేవి. యంత్రాలు అందుబాటులోకి రావడంతో ఎద్దుల అవసరం తగ్గింది.