calender_icon.png 18 October, 2024 | 7:45 AM

నల్లమలలో యువకుడి అదృశ్యం

18-10-2024 01:50:25 AM

  1. మూడు రోజులుగా దొరకని ఆచూకీ
  2. వాహనం, దుస్తులు, హెల్మెట్ స్వాధీనం 

అచ్చంపేట, అక్టోబర్ 17: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధి అమ్రబాద్ మండలం శ్రీశైలం ప్రధాన రహదారిలోని మున్ననూర్ గ్రామ సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో యువకుడి అదృశ్యం కలకలం రేపింది. మూడు రోజులుగా యువకుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత వెతికినా ఫలితం దక్కలేదు.

కేవలం అతడి దుస్తులు, వాహనం, హెల్మెట్ లభించడంతో కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. నల్లమలలో ఇలా వ్యక్తి అదృశ్యం అయిన ఘటన ఇది రెండోసారి. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం శేరుపల్లి గ్రామానికి చెందిన ఈదయ్య (32) ఈనెల 15న తన స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్తున్నట్లు భార్యతో చెప్పి వెళ్లాడు.

అనంతరం తన స్నేహితులు ఎవరూ తనవెంట రావడం లేదని తాను ఒక్కడే వెళ్తున్నట్లు భార్యకు మెసేజ్ ద్వారా సమాచారాన్ని చేరవేసాడు. అయితే అతడు శ్రీశైలంలో దర్శనం అనంతరం తిరుగుప్రయాణంలో మున్ననూర్ గ్రామ సమీపాన గల అటవీ ప్రాంతంలో అదృశ్యం అయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు.. అటవీశాఖ అధికారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా ఈదయ్యకు సంబంధించిన బైక్, హెల్మెట్, దుస్తులు మాత్రమే దొరికాయన్నారు. గతనెల లింగాల మండలం చెంచుపెంటకు చెందిన నిమ్మల శంకర్ (30) పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లి ఇప్పటికీ తిరిగి రాలేదు. ఈ ఇద్దరి యువకుల అదృశ్యంతో నల్లమల్ల అటవీ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.