calender_icon.png 27 November, 2024 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సులో చీరలు ధరించి దివ్యాంగుల నిరసన

27-11-2024 12:54:52 PM

వరంగల్ : ఆర్టీసీ బస్సులలో తమకు ఉచిత ప్రయాణం కల్పించాలని,  ప్రత్యేక సీట్లు కేటాయించి తమకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కలిగించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లాలోని దివ్యాంగులు  వినూత్న నిరసన తెలియజేశారు. వరంగల్ జిల్లా  వర్ధన్నపేట లో నేడు  కొందరు దివ్యాంగులు చీరలు కట్టుకొని ఆర్టీసి బస్సు ఎక్కి నిరసన తెలియజేశారు. ఆర్టీసీ బస్సులలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది దివ్యాంగులు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే  ఇబ్బంది  పడుతున్న పరిస్థితి ఉందని,  ఆర్టీసీ బస్సులలో దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లలో కూడా మహిళలే  కూర్చుంటున్నారని,  దివ్యాంగుల కోసం ప్రతి బస్సులో మూడు సీట్లు కేటాయించాలని వారు కోరారు. దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో వారు కాక ఎవరైనా కూర్చుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.  లేదా తమకు ఆర్టీసీ  ప్రత్యేక బస్సులను  ఏర్పాటు చేయాలని వారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లను విజ్ఞప్తి చేశారు.