04-03-2025 01:17:50 AM
ఎల్బీనగర్, మార్చి 3 : దివ్యాంగుల హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించా లని దివ్యాంగులు ఆందోళన చేపట్టి, నిరాహార దీక్ష చేపట్టారు. చంపాపేట డివిజన్ లోని రెడ్డి కాలనీలో ఉన్న ప్రభుత్వ బాలుర దివ్యాంగుల సదనంలో సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి సోమవారం సుమారు 200 మంది దివ్యాంగులు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులు మాట్లాడుతూ... సదనంలో ఉన్న దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో పాటు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 2016 చట్టం ప్రకారం రెడ్డి కాలనీలో ఉన్న దివ్యాంగుల సదనాన్ని వికలాంగులకు అనువుగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని కోరారు. చంపాపేట మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి దివ్యాంగుల ఆందోళనకు మద్దతు తెలిపారు.
ముందుగా రంగారెడ్డి జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు సంధ్యారాణి వెంటనే హాస్టల్ కు వచ్చి, దివ్యాంగులతో చర్చించారు. మార్చి 20 లోగా సమస్యలను పరిష్కరిస్తానని సంధ్యారాణి రాతపూర్వకంగా హామీ పత్రం ఇవ్వడంతో దివ్యాంగులు ఆందోళన విరమించారు. ఆందోళనలో సుమారు 200 మంది దివ్యాంగులు పాల్గొన్నారు.