calender_icon.png 26 November, 2024 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురికి రాజకీయం

21-10-2024 01:19:53 AM

రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయంగా అత్యంత హాట్ టాపిక్ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టే.. ప్రభుత్వం, ప్రతిపక్షాల సవాళ్లు.. ప్రతిసవాళ్లతో మూసీ పొంగుతున్నది. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం అత్యంత గోప్యత పాటిస్తుం డటం, ప్రతిపక్షాలు ఇదే సందు అన్నట్లుగా అడుగడుగునా అడ్డు తగులుతుండటంతో ఎటు చూసినా మూసీ ముచ్చటే కనిపిస్తున్నది.. వినిపిస్తున్నది.

దీంతో రాష్ట్రంలోని ఇతర సమస్యలన్నీ పక్కకు పోయాయి. అసలు ఈ ప్రాజెక్టు పేరుపైనే అనేక వివాదాలున్నాయి. మొన్నటివరకు మూసీ నది సుందరీకరణ అన్నారు. ఇప్పుడు మూసీ పునరుజ్జీవం అంటున్నారు. ప్రాజెక్టు వ్యయంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజెంటేషన్లతో సవాళ్లు విసురుకొంటున్నాయి. ఇదంతా ప్రజల్లో ఈ ప్రాజెక్టుపై మరింత తికమకను, సందిగ్ధాన్ని, అనుమానాలను రేకెత్తిస్తున్నది.

ఒకనాడు హైదరాబాద్ ప్రజలకు తాగు నీరు అందించిన మూసీ నది ప్రజల బాధ్యతా రాహిత్యం, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నేడు మురికి కాలువలా మారింది. మూసీ వెంట నివసించటం దేవుడెరుగు అటువైపు వెళ్లటానికే ప్రజలు భయపడేలా తయారైంది. అయినా, మూసీకి రెండువైపులా వేలమంది పేదలు నివసిస్తున్నారు. నదీ గర్భంలో కూడా ఏకంగా కాలనీలే వెలిశాయి.

అయితే, ఈ నదికి పూర్వవైభవం తీసుకురాగలిగితే హైదరాబాద్ నగరానికి అద్భుత మణిహారం అవుతుందనటంలో సందేహం లేదు. నగరం మధ్య నుంచి వెళ్తున్న మూసీ పునరుజ్జీవింపజేస్తే గుజరాత్‌లోని సబర్మతి నదికంటే అద్భుత ఫలితాలు చూడగలం. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని సంకల్పిస్తున్న ప్రభుత్వాలు..

మూసీ రివర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి చేయటం కూడా ముఖ్యమేనని భావించటం శుభ పరిణామమే. గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు చాలా చిక్కు ముడులే ఉన్నాయి. అందులో ప్రధానమైనది నది వెంట ఉన్న ప్రజలను అక్కడి నుంచి తరలించటం. మూసీ రివర్‌ఫ్రంట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును అనుకున్నది అనుకొన్నట్లు పూర్తిచేయాలంటే కనీసం లక్ష మందిని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందని అంచనా.

ఇది మామూలు విషయం కాదు. వీరికి పునరావాసం కల్పించటం ఒక సమస్య అయితే.. వారిని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేలా ఒప్పించటం అతిపెద్ద సమస్య. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరింత సున్నితంగా వ్యవహరించి ఉంటే బాగుండేది. ఎకా ఎకిన బుల్డోజర్లతో వెళ్లి ఇండ్లు కూలగొడతాం అంటే ప్రజలు తిరగబడటం సహజమే. 

మూసీ ప్రాజెక్టు విషయంలో మరో కీలక సమస్య ప్రాజెక్టు వ్యయం. ఈ ప్రాజెక్టును లక్షన్నర కోట్లతో చేపట్టినట్లు సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ఒక సమావేశంలో స్వయంగా చెప్పారు. కొందరు మంత్రులు మాత్రం ఇంకా ప్రాజెక్టు డీపీఆరే సిద్ధం కాలేదని ప్రకటనలు చేశారు. దీంతో ప్రాజెక్టు వ్యయంపై వివాదం రాజుకొన్నది.

ప్రాజెక్టు గోప్యతపై బీఆర్‌ఎస్ పార్టీ ప్రధానంగా విమర్శలు చేస్తున్నది. దీంతో ఇటీవల మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదని, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అని చెప్పారు. ఈ రెండింటికి తేడా ఉన్నది. సుందరీకరణ అంటే నదికి రెండువైపులా పార్కులు, మరికొన్ని సౌకర్యాలు కల్పించటం.

పునరుజ్జీవం అంటే నదికి పూర్వవైభం తేవటం. నదిలో మళ్లీ స్వచ్ఛమైన నీరు పారించటం. దీనికి భారీగా నిధులు అవసరం అవుతాయి. అందుకే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును లక్షన్నర కోట్ల రూపాయలతో చేపడుతున్నట్లు సీఎం ప్రకటించారని అనుకోవచ్చు. అయితే, ప్రాజెక్టు పూర్తి వివరాలను ప్రభుత్వం ఇప్పటివరకు బయటపెట్టలేదు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఏం పనులు చేస్తారు? డీపీఆర్‌లో ఏమున్నది అనే వివరాలు ప్రజల ముందు పెడితే అందరికీ స్పష్టత వస్తుంది. అది లోపించటంతోనే ప్రతిపక్షాలు ప్రాజెక్టు వ్యయంపై విమర్శలు చేస్తున్నాయి. గత ప్రభుత్వం రూ.25 వేల కోట్లతో ప్రాజెక్టు మొదలుపెడితే.. ఇప్పుడు లక్షన్నర కోట్లు ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తున్నాయి.

మూసీలోకి వెళ్తున్న మురుగు నీటిని శుద్ధి చేయటానికి సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు (ఎస్టీపీ)లను నిర్మిస్తున్నారు. అయితే, వాటితోపాటు ఇంకా ఏం చేస్తారన్నది ప్రభుత్వం ప్రజలకు వివరించాలి.  అంటే ప్రస్తుతానికే కాకుండా భవిష్యత్తు అవసరాలకు కూడా ఉపయోగపడేలా ఎస్టీపీలను నిర్మించటం.. నగరం బయట నదికి పైభాగంలో నీటి రిజర్వాయర్లను నిర్మించి, ఏడాదంతం స్వచ్ఛమైన నీరు నదిలో పారేలా చేయటం.. నదిలో నీరు నిల్వ ఉండేలా చెక్‌డ్యాములను నిర్మించటం వంటి కీలక అంశాలు డీపీఆర్‌లో ఉన్నాయో లేవో ప్రజలకు ప్రభుత్వం వివరించాలి. 

మూసీ ప్రాజెక్టు వ్యయంపై ప్రతిపక్షాలు చేస్తు న్న విమర్శలు అంత అర్థవంతంగా లేవని అనిపిస్తున్నది. మూసీని పునరుజ్జీవింపజేయటం అంటే మామూలు విషయం కాదు. వేలాదిమందికి పునరావాసం కల్పించాలి. భారీ మొత్తంలో భూసేకరణ చేయాలి. నది రక్షణకు శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి. రెండువైపులా రోడ్లు, పార్కు లు, ఆట స్థలాలు, హోటళ్లు, వినోద ప్రదేశాలు ఏర్పాటుచేయాలి.

ఇలా చేసినప్పుడే ఈ ప్రాజెక్టు విజయవంతమవుతుంది. ఇదంతా చేయాలంటే నిధులు కూడా భారీగా కావాలి. అంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం భరించటం కష్టం. అందుకే బిల్ట్.. ఆపరేట్.. ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) పద్ధతిలో చేపట్టాలి. అప్పుడే ఈ ప్రాజెక్టు లాభదాయకం అవుతుంది. దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా మారుతుంది. ఇంతా చేసి నదిలోని సిల్ట్‌ను, అందులో కలిసిపోయిన ప్రమాదకర ఖనిజాలను శుద్ధి చేయకుంటే ప్రాజెక్టు వ్యర్థమే. ఈ వ్యర్థాలను తొలగించేందుకు సరైన పద్ధతులను అవలంబించాలి. 

మూసీ ప్రాజెక్టు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నది. ఈ ప్రాజెక్టు పూర్తి ప్రణాళిక సిద్ధమై, ప్రభుత్వం దానిని ఆమోదించిన తర్వాత టెండర్లు పిలుస్తుంది. ఆ తర్వాత ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తుంది. గత ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించింది.

కానీ, ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లుగా ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం కాకుండానే ఇది అవినీతి ప్రాజెక్టు అని, అధికార పార్టీ ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నదని విమర్శించటం తొందరపాటు చర్య అవుతుంది. అలా అంటే గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు కూడా అవినీతివేనా? నిధుల దోపిడీ కోసమే చేపట్టారా? అనే ప్రశ్న ఉదయిస్తుంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్, డీపీఆర్ రూపొందించి, దానిని అసెంబ్లీలో చర్చకు పెట్టేవరకు ప్రతిపక్షాలు ఓపిక పట్టాలి. ఇందులో అవినీతిపై అనుమానాలుంటే సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. కానీ, గత ప్రభుత్వం మాదిరిగానే నేటి ప్రభుత్వం టెండర్ ప్రక్రియలను అనుసరిస్తుంటే ప్రతిపక్షాలు తొందరపడి విమర్శించటం సరికాదు. నిజానికి గత ప్రభుత్వ హయాంలో ఇప్పటి ప్రతిపక్షమే కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా మేలు చేసిందనే విమర్శలున్నాయి. 

తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరమే గుండెకాయ లాంటిది. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో మూడింట ఒకవంతు ఇక్కడే జీవిస్తున్నారు. రాష్ట్ర ఆదాయంలో 70 శాతం ఇక్కడి నుంచే సమకూరుతున్నది. మూసీ ప్రాజెక్టు అనుకున్నది అనుకొన్నట్లుగా పూర్తిచేస్తే హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు వరంగా మారుతుంది.

మొత్తంగా రాష్ట్రానికే పెద్ద ఆదాయ వనరుగా కూడా అవతరిస్తుంది. అందువల్ల సంకుచిత రాజకీయాలకు పోకుండా ఈ ప్రాజెక్టును పూర్తిచేయటం అవసరం. నిజానికి ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టుపై విమర్శలు చేయటానికి వేరే కారణాలున్నాయని కూడా ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

విపక్షం పోరాటం ప్రజల కోసం కాదని.. వారి స్వార్థ ప్రయోజనాల కోసమేననే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇలాగే ఇటీవల ఓ పైప్‌లైన్ టెండర్లపై కూడా విపక్షం రాద్ధాంతం చేసి, ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయింది.  

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి