సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల విషయమై నటి పూనమ్ కౌర్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం డ్యాన్స్ మాస్టర్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు హాట్ టాపిక్‌గా మారిన తరుణంలో పూనమ్ ఈ వ్యాఖ్యలు చేయడం అన్నివర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. పూనమ్ మంగళవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. గతంలో తాను ఫిర్యాదు చేసినప్పుడు తనకు ఎవ్వరు సహకరించలేదంటూ దర్శకుడు త్రివిక్రమ్‌ను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేసింది.
రాజకీయంగా కూడా తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. దర్శకుడు త్రివిక్రమ్‌ను ప్రశ్నించాలని సినీ పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నానంటూ ఈ సందర్భంగా వేడుకుంది. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అంతర్గత దారుణాల గురించి మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) త్వరగా చర్యలు తీసుకోవాలి. జానిపై కేసు రుజువు అయ్యేలోపు ఇంకా చిత్ర పరిశ్రమలో ఉన్న తప్పులను వెలికి తీసి కఠిన చర్యలు తీసుకోండి.
గతంలో నేను గురూజీ అని పిలువబడే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేసినప్పుడు నాకు ఎవ్వరూ సహకరించలేదు. మొదట జానీని మాస్టర్ అని పిలువకండి. మాస్టర్ అని పిలవాలంటే ఓ స్థాయి ఉండాలి. ఆ పదానికి కాస్త గౌరవం ఉంచాలి. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు ఇచ్చిన ఫిర్యాదు అసలు తీసుకున్నారా? నాకు, మరికొంత మందికి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవచ్చు. అందుకే నన్ను సైలెంట్‌గా ఇగ్నోర్ చేశారు. నేను అప్పుడు ఉన్న ‘మా’ హెడ్స్‌కి కంప్లుంట్ ఇచ్చాను. ఇప్పుడున్న ఇండస్ట్రీ పెద్దలైనా గురూజీని ప్రశ్నించాలి’ అని రాసుకొచ్చింది.