07-02-2025 02:27:12 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులకు సంబంధించి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సీఐ శ్రీకాంత్ బాబు ఆర్జీవీని విచారిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదలైన 'వ్యూహం'చిత్రాన్ని వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రూపొందించారని కొందరు భావిస్తున్నారు. ఈ సినిమా ప్రచార సమయంలో వర్మ సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను కించపరిచేలా ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు పెట్టారు.
ఈ పోస్టులపై మద్దిపాడు మండల తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం ఫిర్యాదు చేయడంతో ఒంగోలు పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా విచారణకు హాజరుకావాలంటూ గతంలో ఆర్జీవీకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయిన వర్మకు బిజీ షెడ్యూల్‌ను ఉన్నందున్న మరోసారి వస్తానంటూ వాట్పప్ ద్వారా సమాచారం అందించారు. ముందస్తు పోలీసుల అనుమతి లేకుండా తదుపరి విచారణలకు కూడా అతను గైర్హాజరు కావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. దీంతో వర్మ కొంతకాలం పాటు ఆజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తర్వాత పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో సదరు ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసు దర్యాప్తుకు సహకరించాలనే షరతుతో కోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీని ఫలితంగా ఇవాళ విచారణకు హాజరయ్యారు. కాగా, పోలీసుల విచారణకు హాజరు కావడానికి ముందు రామ్ గోపాల్ వర్మను వైసీపి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని ఓ హోటల్‌లో వీరిద్దరూ కలిసి మంతనాలు జరిపారు.