‘గాంధీ తాత చెట్టు’ చిత్ర దర్శకురాలు పద్మావతి మల్లాది
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రంగంపేట (ప్రస్తుతం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పరిధి) గ్రామస్తుల సహజ నటనే ‘గాంధీ తాత చెట్టు’ సినిమాకు అదనపు ఆకర్షణ అని దర్శకురాలు పద్మావతి మల్లాది తెలిపారు. పద్మావతి దర్శకత్వంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ తనయ సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే ‘గాంధీ తాత చెట్టు’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తబితా సుకుమార్ సమర్పకురాలుగా ఉన్న ఈ సినిమాకు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జనవరి 24న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ పద్మావతి సోమవారం విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై సినిమా విశేషాలను పంచుకున్నారు.
మీ నేపథ్యం?
నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. నేను చదివే స్కూల్‌కు మా అమ్మే ప్రిన్సిపాల్. స్కూల్‌తోపాటు ఇంట్లోనూ తన్నులు తినేదాన్ని. పీజీ పూర్తి చేసిన తర్వాత చంద్రశేఖర్ యేలేటి దగ్గర రచనా విభాగంలో పనిచేశాను. రాధేశ్యామ్‌కు కూడా రచయితగా పనిచేశాను. ఆ సమయంలోనే మహానటి సినిమాకు రైటర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. చూసీ చూడగానే సినిమాకు డైలాగ్స్ రాశాను. అమ్ము అనే సినిమాకు కూడా పనిచేశాను. బృంద వెబ్ సీరిస్‌కు రచయితగా వర్క్ చేశాను.
గాంధీతాత చెట్టు చిత్ర కథ మీలో ఎలా చిగురించింది?
చెట్టుకు, మనిషికి లవ్‌స్టోరీ రాస్తే బాగుంటుందన్న నా స్నేహితుడి ఐడియా బాగా నచ్చింది. నాక్కూడా స్వతహాగా పచ్చదనం, చెట్లు అంటే చాలా ఇష్టం. ఈ లైన్‌కు నేను బాగా కనెక్ట్ అయ్యాను. మొక్కల గురించి తర్వాతి తరం వాళ్లకు చెప్పాలనే సంకల్పంతో ఈ కథ రాసుకున్నాను. ఒక అమ్మాయి అహింసావాదంతో ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేదే ఈ కథ. పూర్తి సందేశంతోపాటు కమర్షియాలిటీ ఉన్న సినిమా ఇది. కేవలం అవార్డ్ సినిమా కాదు.
సినిమా చిత్రీకరణ ఎక్కడ చేశారు?
మొదట నా కథా నేపథ్యానికి తగిన వరల్డ్ క్రియేట్ చేద్దామని నిజామాబాద్‌కు వెళ్లాను. నిజామాబాద్ ఫ్రెండ్ ఫామ్‌లో నా కథకు కావాల్సిన చెట్టు దొరికింది. చెరుకు తోటలు ఉన్న రంగంపేట గ్రామంలో చిత్రీకరణ చేశాం. నా కథ 1947లో గాంధీ చనిపోయినప్పుడు తాత నాటిన చెట్టుతో ప్రారంభమవుతుంది.
పీరియాడికల్ నేపథ్యం ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
నేను కథ రాసుకున్నప్పుడే నేను పదో తరగతి చదువుతున్న టైమ్‌లో కథ నడుస్తున్న నేపథ్యాన్ని ఎంచుకున్నాను. ఈసినిమా చిత్రీకరణ చాలా నేచురల్‌గా జరిగింది. ఈ చిత్రీకరణ జరుగుతున్న రెండో రోజే తబితా సుకుమార్ సమర్పణలో చేద్దామని ఆమె నిర్ణయించుకున్నారు.
సుకుమార్ కూతురు ఈ సినిమా కోసం నిజంగా గుండు చేయించుకున్నారని తెలిసింది?
పొస్తటిక్ మేకప్ అనేది అంత ఈజీకాదు. దానికి తగిన బడ్జెట్ లేదు. అంతేకాదు కథలో అమ్మాయి పాత్ర కూడా చాలా ధైర్యవంతురాలు. అమ్మాయిలకు జుట్టు చాలా ముఖ్యం. అయినా సుకృతి కథకు తగ్గట్టుగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.
గాంధీ పాత్రకు సుకృతినే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
నా కథలో అమ్మాయి నాకు సుకృతిలోనే కనిపించిది. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రివ్యూ అప్పుడు థియేటర్‌లో సుకృతిని చూశాను. తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫోటోలు చూసి.. సుకుమార్, తబిత అనుమతితో సెలెక్ట్ చేశాం.
సుకృతి నటన చాలా సహజంగా అనిపిస్తుంది? ఆమె ఎలాంటి హోమ్‌వర్క్ చేసింది?
రెండు నెలలు వర్క్‌షాప్ చేశాం. అన్నీ ముందే రిహార్సల్ చేసేది. 25 రోజుల్లో చిత్రీకరణ చేయాడానికి తగిన ప్రణాళికతో ముందుకెళ్లాం. మొత్తం ప్రణాళిక ప్రకారం వెళ్లాం. సుకృతి బాగా లీనమై నటించేది.
సుకుమార్ సలహాలు ఏమైనా తీసుకున్నారా?
ఇది సపరేట్ జానర్.. నీవు ఎలా తీయాలో అలాగే తీయ్యి. నేను నిన్ను నమ్ముతున్నాను. అన్నారు సుకుమార్ సార్.
సంగీతం గురించి చెప్పండి..
పాటలతోపాటు , రీ రికార్డింగ్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. కళ్లు మూసుకున్నా ఆ నేపథ్య సంగీతంతో కథ అర్థమయ్యేలా ఉంటుంది.
ఇది కేవలం గాంధీ మీద నడిచే కథేనా?
గాంధీ అనే అమ్మాయి గురించి ఈ కథ. గాంధీ సిద్ధాంతాలు ఆ పాత్రలో ఉంటాయి. అలా అని పూర్తిగా గాంధీ బయోపిక్ కాదు. గాంధీ, తాత, చెట్టు.. ఈ మూడింటి కథ ఈ సినిమా.
ఈ సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నారు?
ఈ సినిమాలో అహింస గురించి చెప్పాను. మనుషులు, ప్రకృతి మధ్య అహింస చాలా అవసరం.
అవార్డులు గెలిచిన తర్వాత సినిమాను రిలీజ్ చేస్తున్నారు.. ఎందుకని?
ఇది సుకుమార్ ఐడియా. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని అనుకుంటున్నాను. అవార్డుల వల్ల సినిమాలకు రెస్పెక్ట్ పెరిగింది. పంపించిన ప్రతి ఫెస్టివల్‌లో అవార్డ్ వచ్చింది.
ఈ సినిమాకున్న అదనపు ఆకర్షణలు ఏమిటి?
ఈ సినిమాలో ఆ ఊరివాళ్లతో యాక్ట్ చేయించాం. అందరూ అక్కడి వాళ్లే. ఎంతో సహజంగా నటించారు. వాళ్లు నటించడం సినిమా ఎంతో సహజంగా రావడానికి ఉపయోగపడింది.
తదుపరి సినిమా?
కథలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ఎలాంటిది చేయాలనేది ఆలోచిస్తాను.