calender_icon.png 24 October, 2024 | 7:46 AM

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.5.74 లక్షల కోట్లు

14-07-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, జూలై 13: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 19.54 శాతం వృద్ధిచెంది రూ.5,74 లక్షల కోట్లకు చేరినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) తెలిపింది. జూలై 11నాటికి రూ.5,74,357 కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదుకాగా, ఇందులో  రూ.2,10,274 కోట్ల  కార్పొరేట్ ఆదాయపు పన్ను, రూ.3,46,036 కోట్ల వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉన్నట్టు సీబీడీటీ వివరించింది. కార్పొరేట్ల పన్ను చెల్లింపులు పెరిగిన కారణంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 20 శాతం వృద్ధి జరిగినట్టు పేర్కొన్నది.

సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌లు రూ.16,634 కోట్లు వసూలయ్యాయన్నది. గత ఏడాది ఇదేకాలంలో మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4,80,458 కోట్లు. ఈ జూలై 11 వరకూ రూ.70,902 కోట్ల మేర రిఫండ్స్ జారీచేసినట్టు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. నిరుడు ఇదేకాలంలో రిఫండ్స్‌కన్నా, ఈ ఏడాది 64 శాతం రిఫండ్స్ అధికంగా జారీ అయ్యాయన్నది. రిఫండ్స్‌ని కలుపుకుంటే జూలై 11 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23.24 శాతం వృద్ధితో రూ.5.23 లక్షల కోట్ల నుంచి రూ.6.45 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపింది.