02-03-2025 12:04:32 AM
డైనోసార్ ఈ పేరు వినగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అత్యంత భయంకరంగా కనిపించే ఈ క్రూర జంతువు ఎలా ఉంటుందో తెలియని వేళ... జూరాసిక్ పార్క్ చిత్రం ఆ రూపాన్ని కళ్లకు కట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్‌లు తెలంగాణ నేలపై తిరగాడాయని జియాలజిస్టులు ప్రామాణికంగా రుజువు చేస్తున్నారు.
బండ్లగూడలో జియో సైంటిస్ట్ విలియం కింగ్ పేరిట ఏర్పాటు చేసిన జీఎస్‌ఐ, బిర్లా మ్యూజియంలో డైనోసర్‌ల అస్థిపంజరాలు భద్రంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతి భారీ ఆకారంలో ఉన్న జంతు అవశేషాలు... జయశంకర్ భూపాలపల్లి జిల్లా యామనపల్లిలో శాస్త్రవేత్తలకు లభ్యమయ్యాయి. ఆ ప్రాంతం పేరుతోనే దీనికి కోటాసారస్ యామనపల్లి యాన్‌సీస్‌గా నామకరణం చేశారు.
బిర్లా మ్యూజియంలో..
కోటాసారస్ డైనోసార్ సుమారు 9 మీటర్ల పొడవు, 2.5 టన్నుల బరువు ఉంటుంది. వీటి పళ్లు స్పూన్ ఆకారంలో ఉంటాయి. 1970లో వీటికి సంబంధించిన 840 అస్థిపంజరాలు లభించాయి. కోటాసారస్‌కు సంబంధించిన అస్థిపంజరాన్ని 2001లో... బిర్లా మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ప్రదర్శనగా ఉంచారు. వీటి అస్థిపంజరాలు మన రాష్ర్టంలో లభించినట్లు ఆధారాలు ఉన్నాయని జియాలజిస్టులు పేర్కొంటున్నారు.
కాటారంలో రింకోసారస్
కొన్ని లక్షల ఏళ్ల క్రితం నాటి రింకోసారస్ అస్థిపంజరం ఆనవాళ్లు సైతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం వద్ద లభ్యమయ్యాయి. అక్కడి నుంచి అస్థిపంజరాన్ని మట్టితో సహా పెకిలించుకొచ్చి... బండ్లగూడలోని జీఎస్‌ఐ మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడే దీనికి సంబంధించిన మోడల్‌ను కూడా అందుబాటులో ఉంచారు. గుజరాత్‌లో లభించిన డైనోసార్ గుడ్డు కూడా ఇక్కడే భద్రంగా ఉంది.