calender_icon.png 20 February, 2025 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన పల్లె వెలుగులు

18-02-2025 12:40:17 AM

  1. ‘మహాలక్ష్మి’కి ప్రయాణ తిప్పలు
  2. రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య 40 లక్షలు
  3. ‘ఉచితానికి’ తగిన విధంగా సర్వీసులు కేటాయించని సర్కార్
  4. ఆదాయం వచ్చే సూపర్ లగ్జరీ, డీలక్స్ సర్వీసుల సంఖ్య పెంపు

పెద్ది విజయభాస్కర్ :

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచి తంగా ప్రయాణించేందుకు రాష్ట్రప్రభు త్వం సుమారు ఏడాదిన్నర నుంచి ప్రతిష్ఠాత్మకంగా మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నది. పథకాన్ని వినియోగించుకునే మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు పల్లెవెలుగు బస్సు సర్వీసులను వినియోగించు కుంటున్నారు.

మహిళ తాకిడి పెరగడంతో బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయినప్పటికీ.. సర్కారు పల్లె వెలుగు సర్వీసులను మాత్రం పెంచడం లేదు. చార్జీ చెల్లించి వినియోగించుకునే సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సు సర్వీసులను మాత్రం పెంచుకుంటూ వస్తున్నది.

పథకం ప్రారంభానికి ముందు అందుబాటు లో ఉన్న పల్లెవెలుగు బస్సు సర్వీసుల సంఖ్యతో పోలిస్తే, ఆ తర్వాత వాటి సంఖ్య తగ్గిపోయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉచిత ప్రయాణం అంటూనే పల్లెవెలుగు బస్సు సర్వీసులను తగ్గిస్తూ వస్తుండడంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన ప్రయాణికులు.. తగ్గిన బస్సులు..

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటి వరకు 115 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. కండక్టర్లు వారికి రూ.3,902.30 కోట్ల విలువైన జీరో టిక్కెట్లు జారీ చేశారు. ఉచిత టిక్కెట్ల కోసం సర్కార్ ప్రతినెల రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆర్టీసీ యాజమాన్యానికి చెల్లిస్తున్నది.

తద్వారా ఆర్టీసీని నష్టాల నుంచి ఊబి నుంచి లాభాల్లోకి తీసుకువస్తున్నామని సర్కార్ చెప్తున్నది. కానీ.. క్షేత్రస్థాయిలో పథకాన్ని వినియోగించుకునే మహిళల కోసం పల్లెవెలుగు బస్సులు అంతగా లేవు. 2024 మార్చి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,339 పల్లెవెలుగు బస్సులు ఉండగా, ఇదే ఏడాది జూలై నాటికి వాటి సంఖ్య 3,292కు తగ్గింది. అక్టోబర్ నాటికి 3,224కు తగ్గింది. 

పెరిగిన సూపర్ లగ్జరీ బస్సులు..

2022 వరకు రాష్ట్రవ్యాప్తంగా 586 సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు 239 బస్సులు మాత్రమే ఉండేవి. 2024లో సూపర్ లగ్జరీ 693 బస్సులు, డీలక్స్‌బస్సుల సంఖ్య 306కు పెరిగింది. మహిళలు ఈ బస్సుల్లో  ప్రయాణించాలంటే టిక్కెట్లు కొనాల్సిందే. మహాలక్ష్మి అమలుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 45 లక్షల మంది నిత్యం ఆర్టీసీ బస్సులు ప్రయాణించగా, మహాలక్ష్మి పథకం తర్వాత ఈ సంఖ్య 60 లక్షల మందికి చేరింది.

అంటే.. రోజువారీ ప్రయాణికులు సుమారు 30శాతం పెరిగారు. మొత్తం ప్రయాణికుల్లో మహిళల శాతం 40 నమోదవుతున్నది. రోజుకు 36 నుంచి 40 లక్షల వరకు మహాలక్ష్మి ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సర్కార్ అందుకు తగినట్లుగా బస్సులు పెంచకపోవడంతో ఒక్కో బస్సులో 100 మందికి పైగా కిక్కిరిసి ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడిందని కండక్టర్లు, డ్రైవర్లు వాపోతున్నారు. 

పల్లె వెలుగు బస్సుల సంఖ్య ఇలా..

2024 మార్చి వరకు సర్వీసులు 3,339

2024 అక్టోబర్ నాటికి సర్వీసులు 3,224

 సర్వీసులు           సూపర్ లగ్జరీలు డీలక్సులు

2022 వరకు 586          239

2024లో 693 306

బస్సులెందుకు కొనరు..?

మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం నెలకు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు వెచ్చిస్తున్నది. పథకం అమలుకు పెద్దఎత్తున బస్సులు కొనుగోలు చేయా ల్సి ఉంది. కానీ.. సర్కార్ ఆ పని చేయడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులకు తగినన్ని బస్సులు అందుబాటులో లేవు.

రాష్ట్రవ్యాప్తంగా 2,500 గ్రామాలకు పైగా ఆర్టీసీ బస్సు లే వెళ్లడం లేదు. పల్లెవెలుగు బస్సులు తగ్గిపోతున్నా యి. కొత్త బస్సుల పేరుతో యాజమా న్యం లగ్జరీ, డీలక్స్ బస్సులే తీసుకొస్తున్నది. ఎలక్ట్రిక్ వా హనాల పేరిట ప్రైవేటు లగ్జరీ బస్సు లే అందుబాటులోకి వస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే మున్ముందు ఉచిత బ స్సులు ఉండే పరిస్థితి కనిపించడంలేదు. 

 థామస్‌రెడ్డి, 

ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్