- కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల కొర్రీలు
- తేమశాతం పేరుతో ధర తగ్గింపు
- రైతులు కేంద్రాల్లో పంట విక్రయించలేని పరిస్థితి
- తప్పనిసరి పరిస్థితుల్లో మిల్లులకు విక్రయం
- తద్వారా రూ.500 బోనస్ కోల్పోతున్న రైతాంగం
నల్లగొండ, నవంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించడంతో వానకాలంలో రైతులు రాష్ట్రవ్యాప్తంగా భారీగా వరి సాగు చేశారు. అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ సాగు విస్తీర్ణం అమాంతం పెరిగింది.
పంట చేతికొచ్చిన బోనస్‌తో కలిసి క్వింటాకు రూ.2,800 నుంచి రూ.3 వేల వరకు గిట్టుబాటు అవుతుందని రైతులు ఆశపడగా, చివరకు అవి అడియాశలుగానే మిగిలిపోయాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తేమ, ఇతర కారణాలు చూపి కొర్రీలు పెట్టడంతో రైతులు అక్కడ ధాన్యం విక్రయించలేకపోతున్నారు. దీంతో వారంతా అసలుతో పాటు రూ.500 బోనస్ సైతం కోల్పోతున్నారు.
సేకరణ ఇలా..
జిల్లాలో ధాన్యం సేకరణకు ప్రభుత్వం 346 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిలో దొడ్డు రకాల సేకరణకు 266, సన్నాల సేకరణకు 80 కేంద్రాల కేటాయింపు జరిగింది. జిల్లావ్యాప్తంగా దొడ్డు ధాన్యం 4.70 లక్షల మెట్రిక్ టన్నులు, సన్నా లు 2 లక్షల 80వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని పౌర సరఫరాలశాఖ అంచ నా వేసింది.
ఇప్పటివరకు దొడ్డు రకం 1.80 లక్షల మెట్రిక్ టన్నులు, సన్నాలు మాత్రం కేవలం 800 టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే ధాన్యంలో 17 శాతంలోపే తేమ ఉండాలి. హార్వస్టర్లతో పొలాన్ని అప్పటికప్పుడు కోస్తుండడంతో ఇంత తక్కువ శాతం తేమ రావడం సాధ్యం కాదు.
ధాన్యం రోజుల తరబడి ఎండబెడితే తప్ప తేమశాతం తగ్గదు. వీటికితోపాటు కాంటా అయ్యేదాకా నిరీక్షణ, అకాల వర్షాల భయం, తూకం వేసినా బస్తాలు మిల్లులు చేరేంత వరకు రైతులు పూర్తి బాధ్యత వహించాల్సి రావడం కూడా ఇబ్బందే. దీంతో రైతులు రైస్ మిల్లుల వైపే మొగ్గు చూపుతున్నారు.
ధాన్యమంతా మిల్లులకే...
నాన్ ఆయకట్టు పరిధిలో తొలుత కోతలు మొదలవడంతో రైస్ మిల్లులు తమ మిల్లులను నడుపుకునేందుకు సన్నధాన్యం కొనుగోలు చేశారు. పచ్చిధాన్యాన్ని కొని అధునాతన యంత్రాల్లో స్టీమ్ చేసి నిల్వ చేశారు. ప్రస్తుతం సాగర్ ఆయకట్టులో కోతలు జరుగుతుండడంతో మిల్లులకు ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం వస్తున్నది.
కొనుగోలు కేంద్రాలకు రైతులు వెళ్లకపోవడంతో సన్నాల సేకరణ కేంద్రాలు ధాన్యం లేక వెలవెలబోతున్నాయి. కోతలు ఆరంభంలో ధాన్యం అవసరం ఉండడంతో అధికంగా వెచ్చించి కొంటున్న మిల్లర్లు కోతలు ఊపందుకునే తరుణంలో ధర తగ్గించి రైతుల శ్రమను దోచుకుంటున్నారు. ఆరంభంలో క్వింటా ధాన్యానికి రూ.2,600 వరకు చెల్లించి ఆ తరువాత క్వింటాకు రూ.300 వరకు తగ్గింది.
కొందరు వ్యాపారులు కేవలం రూ.2,100 మాత్రమే చెల్లించడంతో రైతులు రోడ్డెక్కారు. దీంతో ప్రభుత్వం స్పంది ంచి క్వింటాకు మద్దతు ధర రూ.2,320 చెల్లించాలని మిల్లర్లును ఆదేశించింది. అయినా కొందరు సర్కారు ఆదేశాల ను బేఖాతరు చేస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించారు. సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయకట్టులో ఇప్పుడు కోతలు ఆరంభమవుతుండడంతో కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
రైతులకు మద్దతు ధర కల్పించాలి..
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలి. మిల్లర్లు చాలా తక్కువ ధరకు ధాన్యం కొంటున్నారు. అధికారుల అజమాయిషీ కరువైంది. తేమశాతంతో సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకునేలా చూస్తే బోనస్ రూ.500 పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం క్వింటా ధాన్యానికి రూ. 500 బోనస్ ప్రకటించినా ప్రస్తుతం ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఈ పరిస్థితి రైతులను నిరాశకు గురి చేస్తున్నది.
కాంసాని శ్రీనివాస్, రైతు, హజారిగూడెం, అనుముల మండలం
పకడ్బందీగా కొనుగోళ్లు
రాష్ట్ర సివిల్ సప్లు కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్
మంచిర్యాల, నవంబర్ 20 (విజయక్రాం తి): ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీ గా నిర్వహించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ సూచించారు. బుధవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్‌దీపక్, అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్‌తో కలిసి జిల్లా అధికారులు, మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడారు.
ప్రభుత్వం కొనుగోలు కేం ద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యంలో తేమ, తాలు లేకుండా తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాల న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరుకోగా 14.50 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని తెలిపారు.
ఇందులో సన్నరకం 3.44 లక్షల మెట్రిక్ టన్నులు ఉందన్నారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా రైస్ మిల్లులు పని చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీసీఎస్వో బ్రహ్మారావు, సివిల్ సప్లు డీఎం శ్రీకళ, ఏసీఎస్వో వేణుగోపాల్, డీఆర్‌డీవో కిషన్ పాల్గొన్నారు.