న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ తండ్రి విన్సెంట్ టిర్కీ కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న విన్సెంట్ శుక్రవారం మృతి చెందినట్లు దిలీప్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ విన్సెంట్ మృతి పట్ల నివాళి అర్పించారు. ‘హాకీ ఇండియా తరఫున దిలీప్ టిర్కీ తండ్రి విన్సెంట్‌కు సంతాపం ప్రకటిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని తెలిపారు. కాగా సీఆర్పీఎఫ్‌లో పనిచేసిన విన్సెంట్ ఒడిశా రాష్ట్ర హాకీ ప్లేయర్‌గా పలు మ్యాచ్‌లు ఆడారు. ఇక దిలీప్ టిర్కీ భారత్ తరఫున 412 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించారు. భారత్ తరఫున 1996 అట్లాంటా, 2000 సిడ్నీ, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో సభ్యుడిగా ఉన్న దిలీప్ 2002లో భారత హాకీ జట్టు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఆయన సారధ్యంలో భారత హాకీ జట్టు 2002 ఆసియా గేమ్స్, 2003 ఆఫ్రో ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచింది. 1998 ఆసియా గేమ్స్‌తో పాటు 2003 ఆసియా కప్‌లో స్వర్ణాలు గెలిచిన జట్టులో దిలీప్ టిర్కీ సభ్యుడిగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ డిఫెండర్లలో ఒకడిగా పేరు పొందిన దిలీప్ టిర్కీ 2010లో రిటైర్మెంట్ ప్రకటించారు.