20-04-2025 12:00:00 AM
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అన్నిరంగాల్లో సాంకేతిక సౌకర్యాలు తప్పనిసరి అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అత్యాధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ సగటు ప్రేక్షకుడికి వినోదం పంచడంలో సినిమా రంగం నిత్యనూతనంగా తీరొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరో అడుగు ముందుకేసినట్టు తెలుస్తోంది.
తెలుగు చిత్రసీమలో బడా నిర్మాతగా పేరున్న దిల్ రాజు టాలీవుడ్‌కు కొత్త సౌలభ్యాన్ని సమకూర్చే దిశగా సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టబోతున్నారు. తద్వారా సినిమాపై తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పబోతున్నారు.
సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి పట్ల తనకున్న బాధ్యత ఏపాటిదో తెలియజెప్పబోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సినీ ఇండస్ట్రీని అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానంటూ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో చెప్పిన మాటల్ని నిలబెట్టుకోనున్నట్టు తెలుస్తోంది.
క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థతో కలిసి...
మారుతున్న టెక్నాలజీ, ట్రెండ్‌కు తగ్గట్టు కొత్తగా సొంత కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్నీ కంపెనీ గురించి తాజాగా ఓ ప్రకటన చేశారాయన. దీనికి సంబంధించి ఒక వీడియోను సైతం ఆయన విడుదల చేశారు. తెలుగు సినిమాల్లో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన పనులు చేసే క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థతో కలిసి కొత్తగా ఏఐ స్టూడియోను ప్రారంభించనున్నట్టు ఈ వీడియో ద్వారా తెలియజేశారు.
సినిమా ప్రస్థానం ప్రారంభమైన 1913 నుంచి ఇప్పటివరకు కాలానుగుణంఆ ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయనేది కూడా ఇందులో చూపించడం విశేషం. తన కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలను మే 4న వెల్లడించనున్నట్టు దిల్ రాజు తెలిపారు. దిల్ రాజు చేసిన తాజా ప్రకటనను బట్టి చూస్తే..
భవిష్యత్తులో తాను నిర్మించే సినిమాలతోపాటు టాలీవుడ్‌లోని ఇతర చిత్రాల్లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ సహా పలు విభాగాల్లో ఏఐ సాంకేతికతను ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. సినిమాలకు సంబంధించిన ఏఐ టెక్నాలజీ హైదరాబాద్ కేంద్రంగా అందుబాటులోకి వస్తుండటం ముదావహమని, ఇండస్ట్రీ అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని పలువురు సినీరంగ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.