ఆపకండి
వెనక్కి పిలవకండి
మీ మానసిక ఏకాకితనం శిఖరాల మీద
కాంతిపాదాలతో కదం తొక్కుతూ
నడుస్తున్న వాణ్ణి
మీ కళ్లలో పెరిగిన చీకటి అరణ్యాల్ని
తగలబెట్టేవాణ్ణి
మీ గుండెల్లో చోటుచేసుకున్న
శూన్యపు ఆకాశాల్ని వెలిగించే వాణ్ణి
పాలిపోయిన నరనరాన్ని పితికి
జీవనదికి ఊటలు సృష్టించేవాణ్ణి
మీ అస్తిత్వాన్ని ఆశయాల్ని కాలదన్ని
మీ కలల్ని పావులుగా చదరంగం ఆడేవాళ్ల ఆట కట్టించేవాణ్ణి
బీటలెత్తిన మీ కడుపుబీళ్లలో
ఎరువులు వేసి పొలాలు దున్ని
కన్నీళ్లతో పైరులు పెంచి
మీ బిడ్డల భావికి ఆకలి శోకం మాట
లేకుండా చేసేవాణ్ణి
కాకులు గద్దలు వదిలేసిన ఎముకల్లాంటి
పదవుల్ని పట్టుకు
మిమ్మల్ని శాసించే వెర్రికుక్కల్ని
తరిమికొట్టేవాణ్ణి
మీ తలలమీది చంద్రుణ్ని ముక్కలు చేసి
చీకటి అఖాతాల్ని మిగిల్చి
ఎందుకు ఏమిటి అని
ఎదిరించే హక్కు లేదని
వాదించే గాడిదల
నాలికలు పీకేసేవాణ్ణి
మీ ధైర్యాన్ని కొల్లగొట్టి
బానిసలుగా వాడుకుంటూ
మోయలేని చట్టాల గులకరాళ్ళ తట్టలు మోయించేవాళ్లని
వాళ్ల డబ్బాల్ని వాయించే
అపర శిఖండుల్ని
పట్టపగలు బట్టబయలు చేసేవాణ్ణి
ఆపకండి
ఆపకండి
వెనక్కి పిలవకండి.
‘దిగంబర కవులు’
కవితా సంపుటి నుంచి..
- చెరబండరాజు