calender_icon.png 14 February, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ తెరపైకి డిజిటల్ బోధన!

14-02-2025 12:09:58 AM

  • తాజాగా తెరపైకి తెచ్చిన ప్రభుత్వం
  • బడులను డిజిటలైజ్ చేయాలని నిర్ణయం
  • జిల్లాలో 160 పాఠశాలల్లో డిజిటలైజేషన్
  • వచ్చే విద్యా సంవత్సరం పూర్తి స్థాయిలో అమలు

మెదక్, ఫిబ్రవరి 13(విజయక్రాంతి): పాఠశాల విద్యలోనూ సాంకేతికతను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బదులను డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రతి తరగతి గదిలో డిజిటల్ పాఠాలను బోధించేందుకు కసరత్తు పూర్తయింది. మెదక్ జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలకు ఇప్పటికే డిజిటల్ పరికరాలు సరఫరా చేయడం జరిగిందని విద్యాధికారులు చెబుతున్నారు.

పూర్తి స్థాయి డిజిటల్ విద్యను రానున్న విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్నారు. ఇలావుండగా 2015-16 విద్యా సంవత్సరంలో జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు అప్పటి ప్రభుత్వం డిజిటల్ పరికరాలను సరఫరా చేసింది. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఆ విద్యా సంవత్సరం ముగిసేలోపే సగం స్కూళ్లలో పరికరాలు పాడయ్యాయి. దీంతో డిజిటల్ బోధన మూలకు చేరింది. 2017-18 విద్యా సంవత్సరంలో పాఠశాల బోధనకు ఓ విధానం రూపొందించారు.

గతంలో ఇచ్చిన కంప్యూటర్ల సామర్థ్యం తక్కువగా ఉండడం, డిజిటల్ తరగతుల కోసం ఇచ్చిన మోడం సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో బోధన సాధ్యం కాలేదు. దీతో పరికరాలు మళ్లీ మూలకు చేరాయి. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బడులను డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించడంతో మళ్ళీ తెరపైకి డిజిటల్ బోధన ప్రారంభం అయింది.

అయితే ఈ విద్యా సంవత్సరం ముగింపు సమయంలో డిజిటలైజేషన్ విధానం అమలు చేస్తుండడంతో కేవలం 8, 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే డిజిటల్ బోధన అమలు చేసినట్లు తెలుస్తోంది. పదవ తరగతి విద్యార్థులకు ఎక్కువగా మాన్యువల్గానే బోధన చేపట్టారు. 

టీచర్లకు శిక్షణ పూర్తి...

మెదక్ జిల్లాలోని 160 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోధనకు గత సంవత్సరం నుండే శ్రీకారం చుట్టారు. అయితే అనుకున్న స్థాయిలో డిజిటల్ బోధన చేయలేక పోయారు. రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి వచ్చే విద్యా సంవత్సరం వరకు పూర్తిస్థాయిలో డిజిటల్ విద్యాబోధన అమలు కావాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలోని అన్ని సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకు ఈనెల 11, 12 తేదీలలో శిక్షణా కార్యక్రమాన్ని సైతం పూర్తి చేశారు.

గతంలో కూడా వీరికి శిక్షణ ఇచ్చినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు సరియైన అవగాహన కల్పించక పోవడంతో తిరిగి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రానున్న విద్యా సంవత్సరంలో పూర్తి స్థాయిలో డిజిటల్ బోధనకు సిద్దమైనట్లు జిల్లా విద్యాధికారులు చెబుతు న్నారు.

ప్రస్తుతం జిల్లాలోని 160 ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పి) బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా బోధన చేసే విధంగా సాఫ్ట్‌వేర్ రూపొందించినట్లు చెప్పారు. ఇందకు గాను రూ.3-4 లక్షల వరకు ప్రతీ పాఠశాలకు ఖర్చయినట్లు చెప్పారు. 

డిజిటల్ బోధనపై అన్ని చర్యలు..

జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే డిజిటల్ క్లాసులు ప్రారం భించడం జరిగింది. పూర్తిస్థాయిలో రానున్న విద్యా సంవత్సరం నుండి అమ లవుతుంది. ఇప్పటికే ప్రతీ ఉపాధ్యా యులకు శిక్షణ పూర్తి చేశాం. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ పాఠాలు చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ పాఠాలు కొనసాగుతాయి.
 రాధాకిషన్, జిల్లా విద్యాధికారి, మెదక్