calender_icon.png 28 November, 2024 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీపై ముగిసిన డిజిటల్ సర్వే

18-05-2024 01:39:12 AM

వెస్ట్ ఓఆర్‌ఆర్ నుంచి ఈస్ట్ ఓఆర్‌ఆర్ వరకు త్వరలోనే మాన్యువల్ సర్వే

సరిహద్దులు, నిర్మాణాలు, మాస్టర్ ప్లాన్ అంశాలపై ప్రభుత్వ నిర్ణయం కోసం అధికారుల వెయిటింగ్ 

హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, సర్వే అధికారులతో మూసీ అభివృద్ధికి కసరత్తు 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (విజయక్రాంతి):  మూసీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. నగరానికి పశ్చిమ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి తూర్పు ఔటర్ రింగ్ రోడ్డు వరకు 55 కిలో మీటర్ల మేర సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కార్యచరణ ప్రారంభమైంది.

ఇప్పటికే సర్వే పనులు పూర్తి చేసుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవాల్సి ఉండగా, పార్లమెంటు ఎన్నికల కోడ్ ఆటంకంగా మారి పనులకు కొంత బ్రేక్ పడింది. ప్రస్తుతం ఎన్నికలు పూర్తి కావడంతో ఎంఆర్‌డీసీఎల్  తిరిగి మూసీ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పలు దఫాలుగా చర్చించిన ఎంఆర్‌డీసీఎల్ అధికారులు ఫైనల్‌గా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులపై నిమగ్నం కానుంది. 

సరిహద్దులు తేల్చే పనిలో అధికారులు

ఒకప్పుడు నగరానికి అతి ముఖ్యమైన నదిగా ఉన్న మూసీ ప్రస్తుతం అనేక ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలతో నిండి ఉంది. నిజం చెప్పాలంటే మూసీ సరిహద్దులు అసలెక్కడి వరకు ఉన్నాయో తేల్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూసీ నదికి పూర్వవైభవం తేవాలన్నా.. సుందరీకరణతో పాటు ఇంకేమైనా డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఎంఆర్‌డీసీఎల్ ముందుగా సరిహద్దులు తేల్చాల్సి ఉంది. ఆ తర్వాత సరిహద్దు దాటిన నిర్మాణాలను ఏం చేయాలనే అంశంపై, అభివృద్ది చేపట్టేందుకు కావాల్సిన భూసేకరణతో పాటు అనంతరం రూపొందించాల్సిన మాస్లర్ ప్లాన్‌పై చర్చించనున్నా రు.

ఈ మూడు అంశాలపై క్లారిటీ వచ్చాకే మూసీ సుందరీకరణ పనులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తేల్చేందుకు అధికారులు ఇప్పటికే మూసీ వ్యాప్తంగా డిజిటలైజేషన్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (డీజీపీఎస్) ద్వారా డిజిటల్ సర్వేను పూర్తి చేశారు. అయితే, మూసీ సరిహద్దు తేల్చే విషయం ప్రభుత్వ నిర్ణయం అయినందున సీఎం రేవంత్ రెడ్డి సూచనలు, మార్గదర్శకాల కోసం ఎంఆర్‌డీసీఎల్ అధికారులు వేచి చూస్తున్నారు. ఇప్పటికే సీఎస్ శాంతికుమారితో పలు దఫాలుగా చర్చించిన అధికారులకు సీఎంతో జరిగే మీటింగ్‌తో డిజిటల్ సర్వేపై క్లారిటీ రానుంది. 

వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా... 

మూసీ పరివాహక ప్రాంతాన్ని అధికారులు పలు జోన్లుగా విభజించారు. బాపూఘాట్ నుంచి హైకోర్టు వరకు కొత్తగా అభివృద్ది చెందిన ప్రాంతంగా, హైకోర్టు నుంచి చాదర్‌ఘాట్ వరకూ పాతబస్తీగా, చాదర్‌ఘాట్ నుంచి ఫిర్జాదీగూడ వరకు కొత్తగా అభివృద్ది చెందుతున్న ప్రాంతంగా, ఫిర్జాదీగూడ నుంచి ప్రతాపసింగారం వరకు సెమీ అర్బన్‌గా విభజించారు. జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు మూసీలో నీటి ప్రవాహంపై హైడ్రాలజీ స్టడీ చేసేందుకు అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీని ఎంపిక చేశారు. ఈ అధ్యయనానికి సంబంధించిన సమగ్ర నివేదిక ఆధారంగా వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా ప్రత్యేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నారు.

మూసీ పరివాహక ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయనున్నారనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు ఎన్నికల సభలలో ప్రజలకు స్పష్టతనిచ్చారు. మూసీకి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు ఈ పరివాహక ప్రాంతంలో వీది వ్యాపారులకు లబ్ది చేకూరేలా ప్రణాళిక రచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అనంతరం కోడ్ ముగియనుండటంతో మూసీ సుదరీకరణపై మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పనులను మరింత వేగవంతం చేయనుంది.