హైదరాబాద్, డిసెంబర్ 25: ఎన్‌బీఎఫ్‌సీ పైసాలో డిజిటల్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ జారీచేసి రూ. 258.16 కోట్లు సమీకరించడానికి డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన జారీచేసే ఒక్కో కన్వర్ట్‌బుల్ ఈక్విటీ వారంట్ ధరను రూ. 58.20 గా నిర్ణయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వారెంట్లను నాన్-ప్రొమోటర్ గ్రూప్ సంస్థలకు కేటాయిస్తారని, ప్రతిపాదిత కేటాయింపుదారుల్లో యూనికో గ్లోబల్ ఆపర్చూనిటీస్ ఫండ్, నోవా గ్లోబల్ ఆపర్చూనిటీస్ ఫండ్, పీసీసీ టచ్‌స్టోన్‌లు ఉన్నాయి. ఇటీవల ఆర్బీఐ, ఈసీబీ మార్గదర్శకాల ప్రకారం 50 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ల ఇష్యూ(ఎఫ్‌సీసీబీలు)లో తొలి విడత నిధుల్ని విజయవంతంగా సమీకరించినట్లు పైసాలో డిజిటల్ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30నాటికి కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తులు 19 శాతం వృద్ధితో రూ.4,535.2 కోట్లకు చేరాయి. ఆదాయం 33 శాతం పెరిగి రూ.373.6 కోట్లకు, నికరలాభం 6 శాతం వృద్ధితో రూ.91.4 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది.