calender_icon.png 27 September, 2024 | 2:52 PM

నెల రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులు

27-09-2024 01:39:37 AM

  1. నాణ్యమైన విద్య, వైద్యమే ప్రభుత్వ లక్ష్యం
  2. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ 
  3. ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. 30 రోజుల్లో ప్రజలకు ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు అందిస్తామని స్పష్టంచేశారు. గురువారం విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ హాస్పిటల్‌ను సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..  ఆంధ్ర మహిళా సభ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు వైద్యం అందించడంలో డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆలోచన విధానాలకు అనుగుణంగా నడుస్తున్న హాస్పిటల్ మరొక అడుగు ముందుకు వేయడం అభినందనీయమన్నారు. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వైద్య విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. అప్పట్లో మనిషి జీవితకాలం 33 సంవత్సరాలే ఉండేదని.. ప్రస్తుతం 60 సంవత్సరాలు దాటిందని పేర్కొన్నారు.

వైద్య రంగంలో ఆవిష్కృతమవుతున్న టెక్నాలజీ రాబోయే రోజుల్లో మనిషి జీవిత కాలాన్ని వందేళ్లకు పైగా జీవించేలా చేస్తుందనే ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజేషన్ చేసి, అందులో వారు గతంలో తీసుకున్న చికిత్స వివరాలు పొందుపరుస్తామన్నారు. తమకు సమర్థవంతమైన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నారని, సంబంధిత వైద్య అధికారులతో సమీక్షలు నిర్వహించి వైద్య రంగం అభివృద్ధికి తీవ్ర కృషి చేస్తున్నాడని కొనియాడారు. వీలైనంత వరకు పేదలకు ఉచిత వైద్యం లేదా అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. హెల్త్ కార్డుల విషయంలో ఎన్జీవోల సహకారం తీసుకుంటామన్నారు. 

మాది సంక్షేమ ప్రభుత్వం

తమది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఓరియెంటెడ్ గవర్నమెంట్ కాదని, సంక్షేమాన్ని అమలు చేసే ప్రభుత్వమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత సమాజానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాల్సిన అవసరం ఉందని అభిప్రా యపడ్డారు. ఇంత అభివృద్ధి చెందిన సమాజం లో ఎంతోమంది క్యాన్సర్ కారణంగా చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ టీ ఆదినారాయణ మృతి విషయాన్ని ప్రస్తావించారు. క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్‌లో ఉండగా ఆయన కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ మహామ్మరి ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుందన్నారు.

దీనిపై నియంత్రణ అవసరమని, అందుకు అనుగుణంగా ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన పెం పోందించాలని పేర్కొన్నారు. అప్పుడే క్యాన్సర్ మహమ్మరిని జయించవచ్చని ధీమా వ్యక్తంచేశారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రి దశాబ్దాల నుంచి ప్రజలకు సేవలు అందిస్తుందని, తన తల్లిని చికిత్స నిమిత్తం ఇక్కడికి వచ్చా మని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ చైర్మన్ ఎస్‌వీ రావు, వైద్యులు పాల్గొన్నారు.