calender_icon.png 5 January, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ విద్య మిథ్య

03-01-2025 01:00:51 AM

  1. ఏపీ కంటే తెలంగాణ వెనుకబాటు
  2. 26 వేల బడుల్లో నో ఇంటర్నెట్
  3. కంప్యూటర్ సౌకర్యం లేని బడులు 7 వేలకు పైగానే..
  4. టీచర్ల మొబైల్ కనెక్షన్‌తోనే పాఠాలు
  5. ‘యూడైస్’ ప్లస్ వార్షిక నివేదికలో విస్తుపోయే వాస్తవాలు

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాం తి): ‘ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు కార్పొరేట్   స్థాయి విద్య అందిస్తాం.. సాంకేతికతను అందిపుచ్చుకుని డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తాం’ అనే మాటలు వట్టి మాటలని ప్రస్తుతం సర్కార్ స్కూళ్లను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 2022  నాటి ప్రభుత్వం 8, 9, 10 విద్యార్థులకు డిజిటల్ విద్యా విధానాన్ని ప్రారంభించగా, అది ఆరం భ శూరత్వంగానే మిగిలింది.

డిజిటల్ విద్య విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వెనుకబడింది. మన రాష్ట్రంతో పోలిస్తే పొరు గు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనే  మెరుగైన డిజిటల్ విద్యావిధానం అమలులో ఉందని విద్యావేత్తలు వెల్లడిస్తున్నారు. ఇదే విషయా న్ని ఇటీవల విడుదలైన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్ (యూడైస్) 2023 24 వార్షిక నివేదిక సైతం వెల్ల డిస్తున్నది.

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ ప్రపంచం తెలియకపోతే ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో ఎలా పోటీ పడతారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కలిపి మొత్తం 42,901 ఉండ గా, వీటిలో ప్రభుత్వ బడులు 30,022, ఎయిడెడ్ స్కూళ్లు 662, ప్రైవేట్ స్కూళ్లు 12,126, ఇతర పాఠశాలలు 91.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17,114 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నట్లు ‘యూడైస్’ నివేదిక వెల్లడించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 30,022 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో కేవలం 6,578 (21.9 శాతం) స్కూళ్లలో మాత్ర మే ఇంటర్నెట్ సౌకర్యం ఉందని పేర్కొన్నది.

ఈ చొప్పున 23,444 సర్కారు బడుల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదని తేటతెల్లమైంది. అలాగే 417 ఎయిడెడ్ స్కూళ్లు, 1847 ప్రైవే ట్ స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. 

కంప్యూటర్‌కే దిక్కు లేదు..

రాష్ట్రంలోని మొత్తం 42,901 పాఠశాలల్లో 33,434 పాఠశాలల్లో మాత్రమే కం ప్యూటర్ సౌకర్యం ఉంది. 30,022 సర్కారు బడుల్లో కనీసం కంప్యూటర్ సౌకర్యం లేని బడులు 7,876. కొన్ని బడుల్లో కంప్యూటర్ ఉన్నప్పటికీ, యాజమాన్యాలు పాఠశాల నిర్వహణకే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,126 ప్రైవేట్ పాఠశాలల్లో 11,008 బడులు, 662 ఎయిడెడ్ స్కూళ్లలో 258 స్కూళ్లలో మాత్రమే కంప్యూటర్ సౌకర్యం ఉంది.

ఏపీలో కాస్త మెరుగైన వసతులు..

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే మెరుగైన డిజిటల్ విద్యా విధానం అమలవుతున్నదని యూడైస్ నివేదిక వెల్లడిస్తున్నది. ఏపీవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బడులు కలిపి 61,373 పాఠశాలలు ఉండగా, వాటి లో సర్కారు బడులు 45,000, ఎయిడెడ్ 991, ప్రైవేట్ 15,232, ఇతర పాఠశాలలు 150 ఉన్నాయి.

వీటిలో 57,652 (93.9 శా తం) పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉం ది. సర్కారు బడులు 45,000 ఉండగా, ఏకంగా 41,390 బడుల్లో ఇంటర్నెట్ సౌక ర్యం ఉంది. అంటే 92 శాతం ప్రభుత్వ బడు ల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉందన్నమాట.

టీచర్ల మొబైల్ నుంచే ఇంటర్నెట్ వినియోగం..

ప్రభుత్వ బడుల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ఉపాధ్యాయులే తమ మొబైల్ హాట్‌స్పాట్ ఆన్ చేసి అవసరమైనప్పుడు విద్యార్థులకు పాఠాలు బోధిస్తు న్నారు. ఏమైనా డిజిటల్ బోర్డుపై వీడియోలు చూపిస్తూ పాఠాలు బోధిస్తే విద్యార్థులకు సులభంగా అర్థమవుతాయనేది శాస్త్రీయంగా నిరూపితమైన విష యం.

ఇంత ప్రాధాన్యం ఉన్న అంశాన్ని రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు నైరాశ్యం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభు త్వం అమలు చేసిన డిజిటల్ విద్యా విధానాన్ని, ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నా రు.

ఇప్పటికే మేల్కొని ప్రతి సర్కార్ బడికి కంప్యూటర్ సమకూర్చాలని, కచ్చితంగా హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.