calender_icon.png 11 February, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటల నమోదుకు డిజిటల్ క్రాప్ సర్వే

11-02-2025 04:22:33 PM

మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి మండలంలో రైతులు పండించే పంటలను డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా నమోదు చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి తెలిపారు.  మండలంలో యాసంగికి గాను అత్యధిక సాగు విస్తీర్ణం కలిగిన  మందమర్రి, తిమ్మాపూర్ రెవెన్యూ గ్రామాల్లో మంగళవారం డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా పంటల నమోదు చేపట్టారు. ఈ సందర్బంగా వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి మాట్లాడారు. డిజిటల్ క్రాప్ సర్వే  ద్వారా ఎంపిక చేయబడిన గ్రామాల్లో ప్రతి సర్వే నెంబరు, సర్వే సబ్  డివిజన్ నెంబర్ల వారీగా పంటల సాగు విస్తీర్ణాన్ని, పంట రకం, సాగు విధానం, నీటి వసతి వంటి వివరాలను పంట క్షేత్రాల వద్దకు వెళ్లి పక్కాగా నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.

ఈ విదంగా సేకరించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన ఏఈఓ లాగర్ ఆప్ నందు పొందుపరచడం జరుగుతుందన్నారు. డిజిటల్ సర్వే ద్వారా సేకరించిన పంటల గణాంకాలు పంటల సాగు వివరాలతో పాటు, పంటల దిగుబడులను ఖచ్చితంగా అంచనా వేయుటకు, పంట కొనుగోలు అంచనాకు, పంటల బీమా అమలుకు, ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నష్టం వాటిల్లినప్పుడు ఖచ్చితమైన అంచనాకు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.  రైతులు డిజిటల్ క్రాప్ సర్వేకు సహకరించాలని కోరారు.ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా సుమారు 2000 ఎకరాల్లో సర్వే పూర్తయిందని, త్వరలోనే అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించి పంటల నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.