calender_icon.png 4 October, 2024 | 9:01 PM

కుటుంబాల గుర్తింపు కోసమే డిజిటల్ కార్డులు

04-10-2024 05:49:47 PM

ఇంటింటి  సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భగవత్ సంతోష్. 

కల్వకుర్తి: కుటుంబ సభ్యుల వివరాల సేకరణ, డిజిటల్ కార్డుల జారీ కోసం పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వెల్దండ మండలంలోని కంటోని పల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామ పరిధిలో కేశమోని పెంటమ్మ, జావాజీ నాగమ్మల ఇండ్ల వద్ద కొనసాగుతున్న డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను కలెక్టర్  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యజమానులు చెప్పే వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని పెంటమ్మను అడిగి తెలుసుకున్నారు.

ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా అన్ని వివరాలను సక్రమంగా పొందుపర్చాలన్నారు. ఇంటి నెంబరు, చిరునామా, కుటుంబ యజమాని ఎవరు, ఇతర కుటుంబ సభ్యులకు యజమానితో గల సంబంధం వంటి వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు. నిర్ణీత సమయంలోపు సర్వేను పూర్తి చేయాలని, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఏ ఒక్క కుటుంబం కూడా తప్పిపోకుండా నూటికి నూరు శాతం డిజిటల్ సర్వే నిర్వహించాలన్నారు. కుటుంబ యజమాని సూచించిన ప్రకారమే పేర్లను నమోదు చేయాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి రోజు ఒక్కో బృందం 30 నుండి 40 కుటుంబాల సర్వే పూర్తి చేయాలన్నారు. జారీ చేయనున్న డిజిటల్ కార్డులపై  ప్రజలు  ఎలాంటి అపోహాలకు లోను కావలసిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇది కేవలం కుటుంబ గుర్తింపు కోసమే డిజిటల్ కార్డులను జారీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట కల్వకుర్తి ఆర్డిఓ శీను, వెల్దండ తాహసిల్దార్ కార్తీక్ కుమార్, ఎంపీడీవో ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.