calender_icon.png 25 October, 2024 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ అరెస్ట్ చేశామంటూ..

25-10-2024 12:29:58 AM

ఓ వృద్ధుడిని బెదిరింపులకు గురిచేసిన సైబర్ నేరగాళ్లు 

విచారణ పేరుతో బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి

24 లక్షలు స్వాహా

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (విజయక్రాంతి): మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఓ వృద్ధుడిని బెదిరించి రూ. 24 లక్షలు దోచేశారు సైబర్ నేరగాళ్లు. వివరాలిలా ఉన్నాయి.. నగరానికి చెందిన ఓ వృద్ధుడి(74)కి ట్రాయ్ డిపార్ట్‌మెంట్ నుంచి అంటూ ఫోన్ వచ్చింది. మీరు ట్రాయ్ నిబంధనలను ఉల్లంఘించారని చెప్పి  ముంబా యి సీబీఐ అధికారితో మాట్లాడాలని కాల్ బదిలీ చేశారు. దీంతో లైన్‌లోకి వచ్చిన నకిలీ సీబీఐ అధికారి.. మీ ఆధార్ కార్డుతో ముంబైలోని ఓ బ్యాంక్‌లో ఖాతా తెరిచి, దాని ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని చెప్పాడు. దీంతో మీపై మనీలాండరింగ్ కేసు నమోదైందని, మీరు డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నారని, విచారణకు సహకరించాలని వృద్ధుడికి సూచించారు. విచారణ పూర్తయ్యే వరకు ఇంటి నుంచి బయటకి వెళ్లొద్దని చెప్పారు. బాధితుడిని నమ్మించేందుకు క్రైమ్ బ్రాంచ్, సీబీఐ విభాగాల నుంచి వచ్చినట్లు లేఖను చూపించారు. ఈ క్రమంలో వాట్సాప్ వీడియో కాల్‌లోకి వచ్చిన సైబర్ మోసగాళ్లలో ఒక వ్యక్తి.. ఐడీ కార్డుతో కూడిన యూనిఫాం ధరించి, బాధితుడికి తన పేరు మీద నకిలీ అరెస్ట్ వారెంట్‌ను చూపించాడు. ఈ కేసుతో మీకేలాంటి సంబంధం లేకపోతే విచారణకు సహకరించాలని, ఆర్బీఐ నిబంధనల మేరకు మీ ఖాతాలో ఉన్న నగదును తాము సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యక తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. మోసగాడి సూచనలను అనుసరించి బాధితుడు మొత్తం రూ. 24 లక్షలు బదిలీ చేశాడు. అనంతరం వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.