calender_icon.png 13 October, 2024 | 12:54 AM

రైతుల కష్టం.. వర్షార్పణం

03-09-2024 04:20:59 AM

  1. నీట మునిగిన 165 ఎకరాల పంట
  2. జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం
  3. ఏకధాటి వానలకు వణికిన మెదక్ జిల్లా 
  4. పొంగుతున్న ఘణపురం, హల్ది ప్రాజెక్టులు

మెదక్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో మూడురోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఏకాధాటిగా కురిసిన వర్షాలకు జిల్లా వణికింది. వర్షాలతో ఒక్క చేగుంట మండలంలోనే 13 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వర్షాల వల్ల బుంగలు పడిన చెరువులు, తెగిన రోడ్లకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నారు. వర్షాల వల్ల హవేళీ ఘణపురం మండలంలోని బూర్గుపల్లిలో 15 మంది రైతులకు చెందిన 35 ఎకరాల వరి పంట, రాజ్‌పేటలో 15 మంది రైతులకు చెందిన 25 ఎకరాల వరి, హవేళీఘణపురంలో 65 మంది రైతులకు చెందిన 105 ఎకరాల వరి పంట నీటమునిగింది.

జిల్లాలో మొత్తం 2,694 చెరువులు ఉండగా, 369 చెరువులు పూర్తిగా నిండాయి. హవేళీఘణపూర్ పెద్దచెరువు అలుగు వద్ద బుంగ పడడంతో పంట పొలాల్లోకి వరద చేరింది. ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం జలది గ్బంధంలోనే ఉంది. వెల్దుర్తి మండలం మాసాయిపేటలోని హల్ది ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నది. కొల్చారం, నార్సిం గి, చేగుంట, టేక్మాల్, అల్లాదుర్గం, పాపన్నపేట మండలాల్లో సాదారణ వర్షం కురి సింది. కొల్చారంలో అత్యధికంగా 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 44.4 మి.మీ నమోదైంది.

శాంతించిన వరణుడు.. 

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): యాదాద్రి జిల్లాను మూడు రోజులుగా ముసురు కుమ్మున్నది. సోమవారం విడిచిపెట్టంది. వర్షాల ధాటికి అంతర్గత రహదారులపైకి వరద వచ్చి చేరింది. ఆత్మకూర్, ఆలేరు, తుర్కపల్లి, రామన్నపేట, గుండాల, చౌటుప్పల్ మండలాల్లో వర్షపు తీవ్రత కనిపించింది. మూసీ నది పరీవాహకంలో వరద కొనసాగుతోంది. లో లెవల్ కాజ్‌వేలపై నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిపోయాయి. కలెక్టర్ హనుమంతు కే జండగే సోమవారం బీబీనగర్ మండలం రుద్రవెల్లి లో లెవల్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. నదిలో చేపల వేటకు మత్స్యకారులను అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు.

జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం

పాపన్నపేట సెప్టెంబరు 2: వరుస వర్షాలకు ఘణపురం ఆనకట్ట పొంగి పొర్లుతుండటంతో ఏడుపాయ ల వనదుర్గా ఆలయం రెండో రోజు కూడా జలదిగ్బంధంలోనే ఉంది. మంజీరా నది నుంచి ఆదివారం అధిక మొత్తంలో వరద ఘణపురం ప్రాజెక్టుకు పోటెత్తడంతో ఆనకట్ట సామర్థ్యం నిండిమంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. ఆనకట్ట నుండి ఏడు పాయలుగా నీరు ప్రవహిస్తూ ఆలయాన్ని చుట్టుముట్టింది. వరద యాదాస్థితికి చేరగానే అమ్మవారి దర్శనం యాధావిదిగా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.     

అలుగుపారుతున్న చెరువులు

అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 2: అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో మూడు రోజులు నుంచి కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు అలుగుపారుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం డీఎల్‌పీవో మంద సాధన, ఎంపీడీవో శ్రీవాణి బాటసింగారం గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంబాబుతో కలసి మండలంలోని జఫర్ గూడ, బాటసింగారం చెరువులను పరిశీలించారు. ఇప్పటికే జఫర్‌గూడ చెరువు నిండి అలుగుపారడంతో... బాటసింగారం రోడ్డు మార్గాన్ని మూసివేశారు.  గ్రామ పం చాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు వరద పరిస్థితిపై పైఅధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.