calender_icon.png 4 October, 2024 | 8:33 PM

ఇక్కడ చూడం.. వెళ్లిపోవమ్మా..

04-10-2024 05:15:00 PM

గర్భిణిపై అమానుష ప్రవర్తన

జనగామ, (విజయక్రాంతి): ‘నీ ఊరెక్కడా.. ఇక్కడికెందుకు వచ్చావు... ఇక్కడ పరీక్షలు చేయం.. ఇంకెక్కడ పోయి చూపించుకో’... ఓ నిండు గర్భిణితో వైద్య సిబ్బంది అన్న మాటలివి.. గర్భంతో ఉండి పుట్టినిళ్లైన జనగామలో తల్లి వద్ద ఉంటూ పరీక్ష చేయించుకునేందుకు ఎంసీహెచ్​కు వచ్చిన ఓ మహిళతో అక్కడి వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. మైగ్రేషన్​ సాకుతో వైద్య పరీక్షలు చేయకుండా వెనక్కి పంపించారు. జనగామకు చెందిన శ్రుతికి యాదగిరిగుట్టకు చెందిన వ్యక్తితో వివాహమైంది. దీంతో ఆధార్​కార్డులో ఆమె అడ్రస్​ యాదగిరిగుట్టగానే ఉంది. ఆమెకు ప్రెగ్నెన్సీ ఖరారయ్యాక కొన్ని నెలలకు అమ్మగారిళ్లైనా జనగామకు వచ్చి ఉంటోంది.

గర్భవతి కావడంతో పరీక్షలు చేయించుకునేందుకు గురువారం తన తల్లితో కలిసి జనగామ చంపక్ హిల్స్ లోని మెటర్నిటీ హాస్పిటల్ కు వెళ్లింది. ఓపీ రాయిస్తుండగా ఆధార్ కార్డులో యాదగిరిగుట్ట అడ్రస్​ ఉండడంతో ఆమెను ఆ జిల్లాకే వెళ్లాలని సూచించారు. తాను పుట్టి పెరిగింది ఇక్కడేనని, ఎంతోమందికి వైద్య చేయించుకుంటుండగా తనకెందుకు చేయబోరని ప్రశ్నించడంతో వైద్య సిబ్బంది ఆగ్రహానికి గురయ్యారు. నీ జిల్లాకు పోయి చూయించుకో అంటూ దురుసుగా మాట్లాడారని బాధితురాలు ఆరోపించారు. కొన్ని నెలలుగా ఇక్కడే చూపించుకుంటున్నామని చెప్పినా డ్యూటీ డాక్టర్​ వినకుండా వెనక్కి పంపించారని గర్భిణి ఆవేదన వ్యక్తం చేసింది.